కందుకూరు ఘటనపై వైసీపీ నేతల శవరాజకీయాల్నే సీఎం జగన్ కంటిన్యూ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన ఆయన అక్కడకు సమీకరించిన విద్యార్థులు, మహిళలను ఉద్దేశించి రాజకీయ ప్రసంగం చేశారు. డ్రోన్ షాట్ల కోసం చంద్రబాబు ఎనిమిది మందిని చంపేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లోనూ అలాగే చేశారన్నారు. రాజకీయమంటే.. డ్రోన్ షాట్లు కాదన్నారు. అసలు చంద్రబాబు సభలకు జనం ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏ మంచీ చేయలేదన్నారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి.. బాగా ప్రచారం చేసుకోవడానికి వస్తున్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతల వాదన కూడా… కందుకూరు ఘటన జరిగినప్పటి నుండి ఇదే. చంద్రబాబు సభలకు జనం రావడం లేదని.. చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కనిపిస్తున్న జనం అంతా డ్రోన్ షాట్స్ అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి జగన్ కూడా వచ్చేశారు. కందుకూరు దుర్ఘటన జరిగిన తరవాత వైసీపీ నేతలంతా చంద్రబాబు సందు, గొందుల్లో సభలు పెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ఆయన సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చినట్లుగా చూపిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సభలకు జనం ఎక్కువ రావడం లేదని.. అలా చూపిస్తున్నారని చెప్పుకోవడానికే వైసీపీ నేతలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చివరికి జగన్ కూడా అదే చెప్పారు.
అయితే చంద్రబాబు బహిరంగసభలు నిర్వహించడం లేదు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తాను వెళ్లిన పట్టణాల్లో ప్రధాన కూడాళ్లలోనే ఈ రోడ్ షో జరుగుతోంది. గతంలో జగన్ పాదయాత్ర నిర్వహించినప్పుడు ఇవే కూడళ్లలో సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూడా ఈ రోడ్లపైనే సభలు పెట్టారు. అప్పుడు ఇవన్నీ వైసీపీ నేతలకు సందుగొందులు అనిపించలేదు. అయితే అంతర్గతంగా మాత్రం వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు సభలకు ఎందుకంత మంది జనాలు వస్తున్నారనేది వారికీ చర్చనీయాంశంగా మారింది.
మహానాయుడు సమయంలో ఎవరూ రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. బస్సులివ్వలేదు. ప్రైవేటు వాహనాలనూ కట్టడి చేశారు . అయినప్పటికీ జనం వెల్లువెత్తారు. ఆ తర్వాత చంద్రబాబు పర్యటనల్లో జనం అదే మాదరిగా కనిపిస్తున్నారు. పార్టీ నేతలు డబ్బులిచ్చి తరలించే పరిస్థితి లేదు. కనీసం వాహనాలు కూడా పెట్టలేరు. ఆర్టీసీ బస్సులివ్వరు. ప్రైవేటువాహనాలు కష్టం. అయినా జనం.. ఎవరంతటకు వారు వస్తున్నారు. కందుకూరు దుర్ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది.. గాయపడిన వారు ఎవరూ తరలించుకు వచ్చిన వారు….స్వచ్చందంగా వచ్చిన వారు. అంటే.. ప్రజలు చంద్రబాబు సభలకు స్వచ్చందంగా తరలి వస్తున్నారని స్పష్టయింది.
కందుకూరు దుర్ఘటన తర్వాత కావలి పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. అక్కడి నేతలు మామూలుగా చేసే జన సమీకరణ కూడా చేయలేదు. కానీ జనం మాత్రం పెద్ద ఎత్తున వచ్చారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో… చంద్రబాబుపై అభిమానంతో జనం పెద్ద ఎత్తున వస్తున్నారని.. ఇది రాబోయే మార్పునకు సంకేతం అని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలూ ఈ పరిణామంపై చర్చించుకుంటున్నారు.