పర్యవసానాలు అనుభవించాల్సిందేనని తెలంగాణ గడ్డపై నుంచి బీఎల్ సంతోష్ హెచ్చరికలు జారీ చేస్తే ఒక్క బీఆర్ఎస్ నేత కూడా .. ఎదురుదాడి చేయలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా సైలెంట్ గానే ఉంది. ఈ విషయంపై బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు కేసును సీబీఐకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదు. ఉన్న పళంగా తెలంగాణ సర్కార్ కూడా డివిజన్ బెంచ్‌కో..సుప్రీంకోర్టుకో వెళ్లలేదు. వెయిట్ చేస్తున్నారు. 30వ తేదీన రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరు కావాల్సిఉంది. అయినా ఆయన హాజరు కాలేదు. కానీ ఈ విషయాన్ని లైట్ గా ఉంచేశారు.
బీజేపీ పగబడితే ఎలా ఉంటుందో చాలా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు చూశారు. తాజా ఉదాహరణ మహారాష్ట్ర. కేంద్రానికి ఎదురు తిరిగిందని ఉద్దవ్ ధాకరే ప్రభుత్వాన్ని పడగొట్టారు. ముగ్గురు కీలక నేతల్ని జైలుకు పంపారు. ఆర్నాబ్ విషయంలో, షారుఖ్ కుమారుడి కేసు విషయంలో ఎదురు తిరిగిన మంత్రిని దావూద్ తో సంబంధాల పేరుతో అరెస్టు చేశారు. హోంమంత్రి దేశ్ ముఖ్నూ జైలుకు పంపారు. చివరికి సంజయ్ రౌత్‌నూ వదిలి పెట్టలేదు. చివరికి ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు వారి పగ తెలగాణ మీద ఉందని బీఎల్ సంతోష్ హెచ్చరికలతో స్పష్టత వచ్చింది. తమ శత్రువుగా కేసీఆర్‌ను బీజేపీ అగ్రనేతలు డిసైడ్ చేసేశారు.
బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఓ దశలో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. దీన్ని బీజేపీ హైకమాండ్ తేలికగా తీసుకునే చాన్స్ లేదు. బీఎల్ సంతోష్ బహిరంగ హెచ్చరికలు చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ ను టార్గెట్ చేశామని చెప్పకనే చెప్పారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో..బీజేపీ ఏం చేయబోతోందన్న సందేహం పట్టి పీడిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా సీబీఐ చేతికి పోయిన తర్వాత..కేసీఆర్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. కానీ కేంద్రం వద్ద.. దండిగా ఉన్నాయి. వాటితో దాడి చేస్తే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడటం ఖాయం.
ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా వెళ్లడం కన్నా సంయమనం పాటించడం మంచిదని.. బీజేపీ అగ్రనేతల్ని రెచ్చగొట్టవద్దన్న వ్యూహాన్ని బీఆర్ఎస్ చీఫ్ అమలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా.. బీఆర్ఎస్ రెండడుగులు వెనక్కి వేస్తున్నట్లుగానే కనిపిస్తోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.