అమరావతి రాజధానికి కేంద్రంగా ఉన్న తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రాను రాను తేడాగా మారిపోతోంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మొత్తానికి చిందర వందర చేశారు. ఇక ఆమె వల్ల కాదని వైసీపీ హైకమాండ్ పక్కన పెట్టేసి.. టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇంచార్జ్ గా నియమించింది. ఇప్పుడు ఏమయిందో కానీ.. కొత్తగా కత్తరె సురేష్ అనే వ్యక్తిని ఇంచార్జ్ గా నియమించారు. డొక్కాను తప్పించారు. ఆయనకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ పదవితో ఏం చేయాలో తెలియక ఆయన ఖాళీగా ఉంటున్నారు.
కత్తెర సురేష్ .. భార్య కత్తెర హెన్రీ క్రిస్టినా గుంటూరు జడ్పీ చైర్మన్. 2014లో తాడికొండ నుండి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఉండవల్లి శ్రీదేవికి టిక్కెట్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ కత్తెర దంపతులు తాడికొండపై దృష్టి పెట్టారు. వీరు క్రిస్టియన్ మత మార్పిళ్లు జోరుగా చేస్తారన్న ప్రచారం ఉంది. అనుమతి లేకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. వీరి కుల సర్టిఫికెట్ పై అనేక వివాదాలు పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ జగన్ సన్నిహితులు కావడంతో మరో సారి తాడికొండకు వారి పేరు పరిశీలనకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
డొక్కా మాణిక్య వరప్రసాద్ గతంలో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పట్లో ఆయనకు రాయపాటి వర్గంఅండగా ఉంది. ఇప్పుడు ఎలాంటి వర్గం అండగా లేదు. దీంతో ఆయనకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్న చర్చ నడుస్తోంది. మరో వైపు మాజీ హోంమంత్రి సుచరితను పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్.. టిక్కెట్ కూడా ఇవ్వదల్చుకోలేదని.. అందుకే ప్రత్తిపాడు టిక్కెట్ డొక్కాకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అయితే డొక్కాకు.. లేకపోతే సుచరితకు టిక్కెట్ ఇవ్వకుండా జెల్లకొట్టడం ఖాయమని వైసీపీ నేతలు అంచనాకొచ్చారు.