రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరింది. ఇప్పుడు ఆయన గురించి ఒకటే చర్చ నడుస్తోంది. అదేమిటంటే ఆయనకు ఎందుకు చలి వేయడం లేదు అని. ప్రస్తుతం ఉత్తర భారతం చలికి వణికిపోతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందరూ షర్టు మీద షర్టు.. వేసుకుని పైన స్వెట్టర్ వేసుకుని కనిపిస్తున్నారు. చాలా మంది ఎండ వచ్చే దాకా బయటకు రావడం లేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం.. కేవలం ఓ టీ షర్టుతోనే కనిపిస్తున్నారు. తెల్లవారు జామునే పాదయాత్ర టీ షర్టుతోనే ప్రారంభిస్తారు.
ఎంత చలిలో అయినా ఆయన ఒక్క టీ షర్టుతోనే కనిపిస్తున్నారు. అందరూ వణికిపోతూంటే ఆయనమాత్రం కనీసం చలి ఉన్నట్లుగా అనుకోవడం లేదు. దీంతో రాహుల్ గాంధీకి చలి వేయదా అన్న డౌట్ ప్రారంభమయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశాల్లో ప్రధానంగా వినిపించే ప్రశ్న.. ఇదే. ఇంత చలిలో ఒక్క టీ షర్టుతోనే ఎలా ఉంటుందని.. ఎందుకు చలి వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ నవ్వే సమాధానం అవుతోంది.
కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ శరీరం కాస్త మందంగా ఉంటుందని ఆయనకు చలి పుట్టదని చెబుతున్నారు. అయితే ఇలా చలి పుట్టని మనుషులు కూడా ఉంటారా అని కొన్ని మీడియా సంస్థలు సైంటిఫిక్ విశ్లేషణలు కూడా చేశాయి. ఎక్స్ పర్టుల పేరుతో కొంత మంది అభిప్రాయాలనూ తెలుసుకుని ప్రజల ముందు ఉంచాయి. వారు శరీరంలో ఏదో లోపం ఉందన్నట్లుగా చెప్పుకొచ్చారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ రాహుల్ గాంధీకి చలి వేయకపోవడం హాట్ టాపిక్ అయింది. దీనిపై రాహుల్ కూడా విసుక్కుంటున్నారు. నాకు చలి వేస్తే స్వెట్టర్ వేసుకుంటాను.. ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కానీ జనం అసలు విషయాల గురించి కాకుండా కొసరు గురించి మాట్లాడుకోవడం … సోషల్ మీడియా ప్రారంభమైనప్పుడే ప్రారంభమయింది.