వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి తమకో ఆప్షన్ ఉందన్న ఆశను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నరు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆక్కడ మీడియాతో మాట్లాడుతూ మంచి వాళ్లు ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకుంటామన్నారు. చంద్రబాబు దృష్టిలో మంచి వాళ్లు అంటే.. వైసీపీని ధిక్కరించే వారే అనుకోవచ్చు. జగన్ పై విమర్శలు చేసే వారంతా మంచి వాళ్లేనని టీడీపీ జమ కట్టే చాన్స్ ఉంది.
నెల్లూరులోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం, జగన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. వారిపై ప్రస్తుతానికి జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా… తరువాత టిక్కెట్లు కేటాయించడం మాత్రం సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. అలాంటి నేతలకు చంద్రబాబు ఈ రకంగా ఆఫర్ పంపుతున్నారని అనుకోవచ్చు. ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తి పక్రకటిస్తే అంత ఎక్కువ ప్రజాగ్రహం ఉందన్న అభిప్రాయం ఉంటుంది. ఈ కారణంగా చంద్రబాబు మంచి వాళ్లను తీసుకుంటామని వారిని ఊరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ టీడీపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఓ వైపు టిక్కెట్ వస్తుందన్న నమ్మకం లే్కపోవడం.. టిక్కెట్ ఇచ్చినా తీవ్ర ప్రజాగ్రహం కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవదని అంచనాకు వచ్చి ముందుగానే టీడీపీలో కర్చీఫ్ వేసుకోవడం వంటివి కొంత మంది చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఇలాంటివి ఒక్క సారిగా పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు 2024లోనే వస్తే మాత్రం… చాలా మంది బయటపడే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.