ఇది అయ్యప్ప స్వాముల దీక్షా సమయం. స్వామి మాల ధరించేవారంతా భక్తులు. అది వారి నమ్మకం. వారి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. వారిని గౌరవించాలి. అదే సమయంలో నాస్తికుల పేరుతో మాకు దేవుడిపై నమ్మకం లేదనే వారినీ గౌరవించాలి. ఆ గౌరవం కేవలం నమ్మకం లేదనే వరకే. అంతే కానీ దేవుడు లేడని వాదిస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా ఆ దేవుళ్లను కించపరిచనంత వరకే. అందులో ఎలాంటి సందేహం లేదు. నాస్తికుడి పేరుతో దేవుడ్ని కించపరిస్తే అతడు నాస్తికుడు కాదు.. ఖచ్చితంగా ఓ అరాచకవాది అవుతాడు. దేవుడు లేడనే అతని నమ్మకంపై అతనికి ఎంత గౌరవం ఉంటుందో.. దేవుడు ఉన్నాడనే నమ్మేవాళ్ల నమ్మకంపై వారికి అంత గౌరవం. ఇక్కడ ఎవరిని వారు గౌరవించాలి కానీ.. పక్క వాళ్ల నమ్మకాన్ని కించపర్చకూడదు.
నాస్తికత్వం పేరుతో దేవుడ్ని కించపర్చిన నరేష్ అనే వ్యక్తి
తెలంగాణలో భైరి నరేష్ అని చెప్పుకునే అరాచకవాది.. తాను నాస్తిక సంఘ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. కానీ అది దారి తప్పింది. కించ పరిచే వరకూ వెళ్లింది.దేవుడి పుట్టుకను ప్రశ్నించే వరకూ వెళ్లింది. అది కూడా బహిరంగ సభలకు ఎక్కి. పురాణాల్లో ఉన్నవాటిని తెచ్చి ఎగతాళి చేయడం కామన్ అయిపోయింది. అయ్యప్ప స్వాములు ఎక్కువగా దీక్షా ధారణ ఉన్న సమయంలోనే అతను ఉద్దేశపూర్వంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఒక్క సారిగా అలజడి రేగింది. ఇంత జరిగిన తర్వాత కూడా అతను పోలీసులకు దొరక్కుండా సోషల్ మీడియాలో అంత కంటే దారుణమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడంటే అతని ఉద్దేశం అరాచకమేనని అర్థం చేసుకోవచ్చు.
దేవుడ్ని నమ్మకపోతే.. కించపర్చవచ్చా ? నమ్మేవాళ్లని రెచ్చగొట్టవచ్చా ?
నాస్తికుడ్ని.. నాస్తిక సంఘం అధ్యక్షుడ్ని అని అతను చెప్పుకోవడానికి ప్రాతిపదిక ఖచ్చింగా దేవుడే. దేవుడు లేడని ఆయన ఆ నాస్తికుడు ముద్ర పెట్టుకున్నారు. ఉన్నారని నమ్మకం ఉన్న వాళ్లకు పోటీగా అది పెట్టుకున్నాడు. అంటే దేవుడి ఉనికిని గుర్తించినట్లే. ఆ దేవుడి పేరుతోనే తాను చేయాలనుకున్నది చేస్తున్నట్లే. అయినా సరే దేవుడు లేడు అని చెప్పడానికి .. వాదించడానికి ఎంచుకునే మార్గం మాత్రం కించపర్చడం కాదు. నిజంగా నాస్తికుడే అయితే.. అసలు దేవుడు లేడని వదిలేయ్యాలి. ఉన్నారని భావించేవాళ్లను కించపర్చడం ఎలా నాస్తికత్వం అవుతుంది. దేవుళ్లను ఎలా నాస్తికత్వం అవుతుంది..!
మన సమాజంలో ఎవరి నమ్మకాలు వాళ్లవి.. ఒకరిని ఒకరు తప్పు పట్టడం పరమ తప్పు !
ఇది ఓ సమాజం. సమాజంలో మనుషులు రకరకాలుగా ఉంటాయి. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఒకరు దేవుడ్ని నమ్ముతారు. మరొకరు భక్తి ప్రపంచంలోనే ఉంటారు. మరొకరు నమ్ముతారు కానీ పూజలు చేయరు. మరొకరు మానవత్వమే దేవుడనుకుంటారు. కొంత మంది అసలు నమ్మరు. ఎవరి నమ్మకం వారిది. అంతే కానీ ఒకరి నమ్మకాల్లోకి ఇంకొకరు చొచ్చుకెళ్లి ఏదో చేయాలనుకంటే అలజడి రేగుంది. సమాజంలో అశాంతికి కారణం అవుతుంది. ఇక్కడ భైరి నరేష్ అదే చేశాడు. అతని వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఇలాంటి వారు మారితేనే సమాజానికి మేలు. లేకపోతే అందరూ ఆ మంటల్లో నలిగిపోవాల్సిందే.