గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు చనిపోయారు. గత వారమే కందుకూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారు. దీంతో ఈ ఘటన కూడా సంచలనం సృష్టించింది. చంద్రబాబు సభల్లో అసలేం జరుగుతోంది. జనం తొక్కిసలాట జరిగి చనిపోయేంత వెల్లువలా వస్తున్నారా ? తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారా ? అసలేం జరుగుతోంది ?
వరుసగా చంద్రబాబు సభల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ?
చంద్రబాబు నలభై ఏళ్ల నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లక్షల మంది పాల్గొన్న సమవేశాలకు హాజరయ్యారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతోంది. అదీ వారం రోజుల్లో రెండో సారి. ఎందుకిలా జరుగుతోందని టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల భద్రత తక్కువగా పెడుతరాని తెలిసి.. తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున వాలంటీర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియంత్రించుకుంటున్నారు. అయినా గుంటూరు ఘటన జరిగింది.
టోకెన్లు ఉన్నా దుస్తులు దొరకవని పుకారు పట్టించిందెవరు ?
గుంటూరులో ఉయ్యూరు ట్రస్ట్ వాళ్లు పేదలకు సంక్రాంతి కానుక పంపిణీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించి వెళ్లిన తర్వాత ఓ పక్కన తొక్కిసలాట జరిగింది. దుస్తులు టోకెన్లు కూడా ఉన్న వారికి కూడా అందవనే పుకారు లేపడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఒకరు సంఘటనా స్థలంలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. రెడీ చేసి పెట్టుకున్నట్లుగా ఏకీకృత దాడిని చంద్రబాబుపై చేసింది. నిజానికి అది బహిరంగసభ కాదు. టీడీపీ ఏర్పాటు చేసింది కాదు. ప్రజలకు సాయం చేసేందుకు పెట్టిన సభ.
అంత ప్లాన్డ్ గా తొక్కిసలాట వీడియోలు.. చంద్రబాబును తిట్టించే వీడియోలు తీసుకోడం ఎలా సాధ్యం ?
జనవరి ఒకటో తేదీన .. ఆదీ ఆదివారం.. సాయంత్రం సోషల్ మీడియా ఉద్యోగులంతా చాలా బిజీ అయిపోయారు. ఓ దుర్ఘటన జరగబోతోందని వారికి ముందుగానే తెలిసినట్లుగాప పకడ్బందీగా ట్రెండ్ చేయడానికి అవసరమైన హ్యాష్ ట్యాగ్లు… నారా హంతకుడు లాంటి టైటిల్స్ తో పోస్టర్లు వేసుకుని రంగంలోకి దిగారు. అనుమానం ఏమిటంటే .. అక్కడ తొక్కిసలాట జరుగుతుందని కొంత మందికి ముందే తెలిసినట్లుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో అక్కడే చంద్రబాబును బూతులు తిట్టేందుకు కొంత మందిని ఆరెంజ్ చేసి పెట్టుకుని తమ తిట్ల దండకాన్ని వినిపించారు. ఒకరిద్దరు మహిళలే అన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడటం పక్కా ప్రణాళిక అని అర్థం చేసుకోచ్చని టీడీపీ నేతలంటున్నారు.
రాజకీయ కుట్రలయితే ..పాపం ప్రజలు !
రాజకీయంగా దిగజారిపోతే కుట్రలు, కుతంత్రాలు ఎలా ఉంటాయో సినిమాల్లోనే చూస్తాం. కానీ విచిత్రంగా కొన్నాళ్లుగా అలాంటి సీన్లు ఏపీలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలు.. ఆ తర్వాత ఆయనపై జరుగుతున్న ప్రచారం వెనుక ఇలాంటివే ఉంటే మాత్రం.. పాపం ఏపీ ప్రజలు అని జాలిపడటం తప్ప ఏమీ చేయలేం.