జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం జనసేన సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య.. రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తూండటమే. జోగయ్య.. చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనూ జోగయ్య దీక్ష కొనసాగిస్తున్నారు.
జోగయ్య దీక్షపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని పవన్ కల్యాణఅ డిమాండ్ చేశారు. 85 సం. వయసులో హరిరామజోగయ్య గారు దీక్ష చేపట్టారని… ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నానని పవన్ తెలిపారు. హరిరామజోగయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణం చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేగొండి హరిరామ జోగయ్య ఆమరణదీక్ష కొనసాగిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశఁపై ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. చట్ట న్యాయపరంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టత వచ్చిన తర్వాత కూడా కాపుల చిరకాల డిమాండ్ ను తీర్చడానికి.. ప్రభుత్వం ముందుకు రావడం లేదు.