ఈమధ్య తమిళ హీరోల కన్ను టాలీవుడ్ పై పడింది. ఇక్కడి దర్శకులతో.. స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ధనుష్ కూడా తెలుగులో బిజీ అవుతున్నాడు. తన తొలి తెలుగు సినిమా `సార్` షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల సినిమా కూడా ఓకే చేశాడు. ఇప్పుడు మరో ప్రాజెక్టుపై సంతకం చేసినట్టు టాక్. దిల్ రాజు బ్యానర్లో ధనుష్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడని టాక్. `శ్రీకారం` ఫేమ్ కిషోర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పైప్‌లైన్‌లో ఉన్నాయి. అన్నీ కుదిరితే.. ధనుష్ నటించే తదుపరి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
ఈమధ్య దిల్ రాజు కూడా తమిళ హీరోలు, దర్శకులపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు. విజయ్‌తో `వారసుడు` రూపొందిస్తున్న దిల్ రాజు… శంకర్‌తో ఓ సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు ధనుష్ ని కూడా లైన్లో పెట్టేశాడు. ఓ తమిళ హీరో తెలుగులో సినిమా చేయడం వల్ల.. చాలా వెసులు బాటులు దొరుకుతున్నాయి. తమిళ హీరోలు సైతం తెలుగులో మార్కెట్ విస్తరించుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది.