ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నినాదంతో ప్రపంచం మొత్తం ఏపీని చులకన చేసేశారన్న ఫీడ్ బ్యాక్ చివరికి ఆయనకు చేరిందో లేకపోతే చేరిన ఫీడ్ బ్యాక్ను చివరికి నమ్మడం ప్రారంభించారో కానీ… ఇప్పుడు ఇక మూడు రాజధానులు కాదు ఒక్కటే రాజధాని అనే కాన్సెప్ట్ కే ఆయన ఓకే చేయబోతున్నట్లుగా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే అ ఒక్కటి అమరావతి కాదు విశాఖపట్నం. త్వరలో అక్కడ ఇన్వెస్టర్స్ మీట్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే పెట్టుబడిదారులకు మీ రాజధాని ఏది అంటే ఏం సమాధానం చెప్పాలని తెగ ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికి వచ్చారట.
పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చే వారు రాజధాని ఏది అని అడిగితే ఏం చెబుతారు ?
పెట్టుబడిదారుల సదస్సుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మందిని ఆహ్వానిస్తోంది. ఎంత మంది వస్తారో తెలియదు కానీ.. వచ్చిన వారంతా మీ రాజధాని ఏది అని అడగడం సహజం. ఎందుకంటే వారి దృష్టిలో అమరావతి ఉంటుంది. గతంలో అమరావతి ప్రపంచ పెట్టుబడిదారుల్ని ఆకర్షించింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ అమరావతిని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మీ రాజధాని ఏది అంటే.. చూపించాలి. మూడు రాజధానులు అని చెబితే ఎగాదిగా చూసి వెళ్లిపోతారు. అలా కాకుండా విశాఖ రాజధాని అని చూపిస్తే.. కొంత మంది శాటిస్ ఫై అవుతారన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశాఖ ఒక్కటే రాజధాని అని ప్రకటించే యోచన
అయితే విశాఖ ఒకటే రాజధాని అని ప్రకటించాలంటే అనేక చట్టబద్ధమైన సమస్యలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారన్నది ఇప్పుడు కీలకం. జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ ఉంది. 261మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారి వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించలేరు. అధికారికంగా ప్రకటన చేయలేరు. కానీ జనవరి 31న స్టే వస్తుందని.. వైసీపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అందుకే విశాఖ రాజధానిగా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
చట్టబద్దంగా సాధ్యమవుతుందా ?
ఒక వేళ స్టే రాకపోయినా సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చని.. రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రానిదే కాబట్టి.. ఆ అధికారాన్ని ఉపయోగించుకుని తాము వెళ్లిపోతున్నామని ప్రభుత్వం ప్రకటించుకోవచ్చు. కానీ చట్టబద్ధ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. రైతులకు న్యాయం చేయాల్సిందే. అమరావతి ప్రాజెక్ట్ నుంచి ప్రభుత్వం తప్పుకుంటే రైతులకు రూ. లక్ష కోట్ల వరకూ పరిహారం చెల్లించాల్సి రావొచ్చు. మొత్తంగా ఈ ప్రభుత్వం ఒక్క పనీ సక్రమంగా చేయసుకోలేదు. అన్నీ అడ్డగోలుగా చేసి బోర్లా పడుతూ వస్తోంది. .ఈ సారి కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది.
ఇటీవల మంద్రి ధర్మాన ప్రసాదరావు విశాఖను రాజధానిగా చేయకపోతే ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా ఈ కోణంలోనే వ్యూహాత్మకంగా చేస్తున్నారని తాజా పరిణామాలతో ఎక్కువ మంది నమ్ముతున్నారు.