పాదయాత్రలు చేసి వ్యక్తిగత ఇమేజ్ లు పెంచుకోవడం కన్నా.. పార్టీ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని బీజేపీ తెలంగాణ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. నియోజకవర్గ స్థాయిలో బలపడలేదని తేలడంతో గ్రామ, గ్రామానికి వెళ్లాలని ప్రోగ్రాం రూపొందించి నేతలు ఇచ్చింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని నిర్ణయించారు. అలాదే 119 నియోజక వర్గాల తెలంగాణలో 9 వేల శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్ను నియమించారు. బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హూంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో .. చేర్చుకునే విషయంలో మాత్రం ఆలోచన చేస్తుననట్లుగా చెబుతున్నారు. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.