ఎప్పుడూ లేనిది ఈ సంక్రాంతికి ఇద్దరు టాప్ స్టార్ల సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాల మధ్య పోటీ ఉంటే కలెక్షన్లు కూడా ఆటోమేటిక్ గా రెండింటికి పెరుగుతాయి. ఈ ఫార్మాలా గురించి టాలీవుడ్ జనాలకు తెలియనిదేం కాదు. ఇద్దరు అగ్రహీరోల మధ్య హైప్ క్రియేట్ చేసి వదిలిన సినిమాలు.. రెండు రోజుల్లో రూ. వంద కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేశాయి. ఎవిరికి ఎక్కువ.. ఎవరికి తక్కువ అన్నది పక్కన పెడితే.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమలకు ఈ వసూల్లు ..ఓ ఉత్సాహాన్నిచ్చాయని అనుకోవచ్చు. అటు ఇండస్ట్రీకి లాభం.. ఇటు హీరోలకు లాభం.. మరి మధ్యలో ఫ్యాన్ వార్స్‌కు పాల్పడుతున్న వారికి వచ్చేదేంటి ?
చిరు, బాలకృష్ణ సినిమాల పోటీ.. టాలీవుడ్‌కు మేలు !
చిరంజీవి, బాలకృష్ణ వ్యక్తిగతంగా మిత్రులే. ఇద్దరి సినిమాలు నిర్మించింది ఒక్క నిర్మాతే. ఇలాంటప్పుడు పోటీ అనేది ఉండకూడదు. కానీ.. పోటీ ఏర్పడింది. అయితే అది హీరోల మధ్య లేదా నిర్మాతల మధ్య ఏర్పడలేదు., కేవలం ఫ్యాన్స్ మధ్యనే ఏర్పడింది. వారికి వారే హైప్ క్రియేట్ చేసుకున్నారు. అది సినిమాలుక మేలు చేసింది. పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడింది. దానికి పండగ సీజన్ తోడయింది. బడ్జెట్ ప్రకారం ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ తొలి వారంలోనే అవుతాయి. అయితే వాటికి అయిన బిజినెస్ ప్రకారం లాభాలు వస్తాయో లేదో ముందు ముందు తేలుతుంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం టాలీవుడ్‌కు సక్రాంతి కళ తీసుకు వచ్చాయని చెప్పుకోవచ్చు.
చిరంజీవి, బాలకృష్ణలు ఇప్పుడు కొత్తగా సాధించేదేంటి ?
చిరంజీవి, బాలకృష్ణ తమ కెరీర్లో అత్యున్నత శిఖరాలు చూశారు. కొత్త తరం కూడా వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్లో కలెక్షన్ల పరంగా, బిజినెస్ పరంగా వారే టాప్ స్టార్స్, సీనియర్ స్టార్లు వారి తర్వాతే . అంత మాత్రాన వారి స్టామినాను తక్కువ అంచనా వేయలేం. అరు పదులు దాటిన తర్వాత కూడా వారి ప్రేక్షకుల్ని ఎంటర్ టెయిన్ చేయడానికి వారు పడుతున్న కష్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. వారి పని వారు చేసుకుంటున్నారు. వారు కొత్తగా సాధించాల్సింది సినీ రంగంలో ఏమీ లేదు. కాబట్టి.. ఈ కలెక్షన్లలో ఒకరికి ఎక్కువ.. ఒకరికి తక్కువ వచ్చినా వాళ్లకి అనవసరం.
ఫ్యాన్స్ వార్స్ తో ఎవరికి నష్టం ?
ఫ్యాన్ వార్స్ కి ఆ హీరోలకు సంబంధం లేదు. నిజానికి ఆ హీరోలను చూసి.. ఈ ఫ్యాన్ వార్స్ కు పాల్పడేవారు బుద్ది తెచ్చుకోవాలి. తమ జీవితంలో కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా కష్టపడుతున్నారో సీనియర్ హీరోలు ఇప్పుడూ అలాగే్ కష్టపడుతున్నారు. అది వారి డెడికేషన్. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కు పాల్పడేవారు.. ఏం చేస్తున్నారు ? వారి పని వారు చేస్తున్నారా ? అంటే.. ఆలోచించాల్సిన విషయమే. ఎప్పుడో పాత కాలం సినీ అభిమానుల్లా ఇప్పటికీ తమ జీవితాలను హీరోల సినిమాలపై చర్చలకు త్యాగం చేసుకుంటూ కాలం గడిపితే ఏం వస్తుంది ? ఏ హీరో అయినా తన అభిమానులు తన సినిమా చూడాలని కోరుకుంటారు కానీ.. అన్నీ వదిలేసి తన సినిమానే భుజాన వేసుకుని తిరగమని చెప్పరు.
ఫ్యాన్స్ సినిమాలను ఆడించలేరు. వారు మహా అయితే ఒకటికి నాలుగు సార్లు సినిమా చూడగలరు. చూపించలేరు. సినిమా బాగుంటే చూసేందుకు వచ్చే వారి వల్లనే సినిమా హిట్ అవుతుంది కానీ.. సోషల్ మీడియాలో పరాయి హీరోని తిట్టి..ఆయన అభిమానులతో గొడవపడటం వల్ల్ రాదు. ఇలా చేయడం వల్ల ఆ హీరోకు కూడా మేలు జరగదు. ఫ్యాన్స్ తమ హీరోలను చూసి స్ఫూర్తి పొందకపోగా… తమ జీవితాలను త్యాగం చేసేసుకుంటున్నారు. ఎప్పుడు నేర్చుకుంటారో మరి !