జనసేన అధనేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనానికి కొండగట్టు అంజన్న వద్ద పూజ చేయిస్తానని ఎప్పుడో ప్రకటించారు. దీనికి జనవరి 24వ తేదీన ముహుర్తం ఖరారు చేశారు. ఆ రోజున కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని.. ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపనున్నారు. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురికాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు.
రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
నారసింహ యాత్రను చేస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు తొలి సారిగా ప్రారంభిస్తున్నారు. ఈ ఆలయాలుఏపీలోనూ ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం చేయబోయే యాత్ర ఈ నారసింహ యాత్ర మాత్రమేనా లేక ప్రత్యేకంగా మరో యాత్ర ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. వారాహితో రాష్ట్రమంతా పర్యటిస్తారని .. ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు.