భారత్లో ప్రభుత్వాల నిర్వాకం వల్ల పెత్తందారులు పెరిగిపోతున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా పేదవర్గాల్లో కలిసిపోతున్నారు. భారత్లో ఉన్న మొత్తం సంపదలో నలభై శాతం ఒక్క శాతం సంపన్నుల వద్ద పోగుపడిపోయింది. మొత్తం సంపదలో 60 శాతం కేవలం 5 శాతం మంది వద్ద ఉంది. అంటే.. మిగతా 95 శాతం మంది 40 శాతం వద్ద ఉంది. కానీ వీరు కూడా రానురాను పేదలవుతున్నారు. ఆ కుబేరులు మాత్రం ఎప్పటికప్పుడు కుబేరులవుతున్నారు.
దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం తీవ్రంగా పెరిగిపోతోందని ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. దేశంలో సగం మంది జనాభా వద్ద .. మూడు శాతం సంపద మాత్రమే ఉంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ఆక్స్ ఫామ్ సంస్థ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్- ది ఇండియన్ స్టోరీ’ పేరుతో ఓ రిపోర్టును విడుదల చేసింది. ఇందులో సంచలన విషయాలు ఉన్నాయి. అతి తక్కువ సంపద ఉన్న పేదలే.. ధనవంతుల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు. ఈ పన్నుల కారణంగా వారు మరింత పేదలవుతున్నారు. కుబేరులు మరింత కుబేరులవుతున్నారు.
దేశంలోని టాప్ 10 మంది కార్పొరేట్ల వద్ద రూ.27.52 లక్షల కోట్ల సంపద ఉంది. 2021 నాటి సంపదతో పోల్చితే దాదాపు 9 లక్షల కోట్లు పెరుగుదల చోటు చేసుకుంది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. కానీ వీరు కట్టే పన్నులు.. మూడు శాతం సంపద మెజార్టీ బీద ప్రజలు కట్టే పన్ను కన్నా తక్కువ. 2021-22లో దేశంలో వసూలైన రూ.14.83 లక్షల కోట్ల జిఎస్టి )ల్లో 64 శాతం రాబడి కూడా అట్టడుగున ఉన్న 50 శాతం మంది నుంచి వచ్చిందే. అంటే పన్నుల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలను ఏ స్థాయిలో ప్రభుత్వం పిండేస్తుందో సులువుగా అర్థం అవుతుంది.