ప్రభుత్వాలు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనే ఓ పన్ను వసూలు చేస్తాయి. సాధారణంగా ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి జీతంలో నుంచే యాజమాన్యాలు కత్తిరించి .. ప్రభుత్వానికి జమ చేస్తాయి. ఇది నెలకు రూ. రెండు వందల వరకు ఉంటుంది. అంటే ఏటా రూ. రెండు వేల నాలుగు వందలు. ఈ జాబితాలోకి జర్నలిస్టులు కూడా వస్తారు. జీతాలు తీసుకునే జర్నలిస్టుల దగ్గర్నుంచి ఇవి వసూలు చేస్తారు. అయితే జర్నలిజంలో కంట్రిబ్యూటర్ వ్యవస్థ ఉంటుంది. దానికి జీతాలు రావు. లైన్ అకౌంట్ ద్వారా పే చేస్తారు. ఈ మధ్య అలా పే చేస్తున్న మీడియా సంస్థలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
ఇలాంటి మండల స్థాయి కంట్రిబ్యూటర్లకు ఆదాయం ఆరేడువేలు కూడా ఉండదు. కానీ ఇలాంటి వారందర్నీ ప్రభుత్వం కనిపెట్టేసింది. అందరికీ.. పన్నులు కట్టాలని నోటీసులు జారీ చేస్తోంది. మీరు జర్నలిస్టు వృత్తి నిర్వహిస్తున్నారు కాబట్టి వృత్తి పన్ను కట్టాల్సి ఉంది. మీరు గత ఐదేళ్లుగా కట్టడం లేదు..కాబట్టి ఐదేళ్ల పన్నును ఇప్పుడే కట్టాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా కొంత మంది జర్నలిస్టులకు వచ్చిన నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పేరోల్స్ లో ఉండరు కాబట్టి… వారికి పన్ను విధించాలని ఎవరూ అనుకోలేదు. వారు పన్ను జాబితాలోకి వస్తారని కూడా అనుకోలేదు. కానీ ఆదాయం కోసం ఎక్కడెక్కడా అని వెదుకుతున్న ప్రభుత్వానికి… ఎదురుగా ఉన్న మనిషిని స్కాన్ చేసి.. ఏ రూపంలో పన్నులు వసూలు చేయవచ్చో లెక్కలేస్తోంది. అందులో భాగంగానే ఈ చిన్న కంట్రిబ్యూటర్ల దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం తీరు చూసి.. .. ఆ జర్నలిస్టులకు మూర్చవచ్చినంత పనైపోతుంది. తాము జీవితమంతా కరువులో ఉంటామని కానీ ప్రభుత్వం తమ కంటే దరిద్రంలోకి జారిపోయిందని సెటైర్లు వేసుకుంటున్నారు.
ఇప్పుడు జర్నలిస్టులు.. రేపు యాచకుల దగ్గర కూడా పన్ను వసూలు చేయవచ్చని.. అది కూడా వృత్తిగానే పరిగణిస్తారని.. ప్రభుత్వానికి అన్ని తెలివి తేటలున్నాయన్న విమర్శలు సహజంగానే వినిపిస్తున్నాయి.