ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై తనకు తానే తీర్పులు చెప్పుకుంటోంది. కోర్టు ఏం చెబుతుందో అన్నది కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు అమలు చేస్తమని చెబుతోంది. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 261 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 31వ తేదీన విచారణ జరగనుంది. అయితే అసలు విచారణ జరగక ముందే ఏపీ మంత్రులు ఉగాది నుంచి ఏపీ రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని ప్రకటిస్తున్నారు. రాజ్యాంగపరంగా ఎలా సాధ్యమో మాత్రం చెప్పడం లేదు.
ఏపీ ప్రభుత్వం, మంత్రులు చట్టాలను.. రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవించడం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఒక సారి కాదు.. రెండు సార్లు కాదు పదే పదే ఆ ప్రస్తావనను మంత్రులు తీసుకు వస్తున్నారు. చట్ట ప్రకారం రాజధాని తరలింపు సాధ్యం కాదు. రాజధాని తరలింపు అనే పేరు లేకుండా.. సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో ఏర్పాటు చేసుకుంటామని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నే ఏర్పాటు చేస్తామంటున్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే ఇచ్చి.. రాజధాని తరలింపునకు ఆమోదం ఇస్తేనే అధికారికంగా తరలించడం సాధ్యం అవుతుంది. లేకపోతే ఉండదు. ఆ విషయం ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియనిదేం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను డీగ్రేడ్ చేస్తూ.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.