భవిష్యత్ అంధకారమైనప్పుడు యువత నిర్వీర్యం అయిపోతుంది. యువ శక్తి పక్కదారి పడుతుంది. సరైన దారిలో యువతరాన్ని నడిపించకపోతే.. మొత్తం అరాచకం రాజ్యమేలుతుంది. ప్రపంచంలో అనేక దేశాలు.. ప్రాంతాలు చూసిన సత్యం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. పారిశ్రామిక రాష్ట్రం కాదు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రతీ వ్యాపారం నిర్వీర్యమయ్యే పరిస్థితి. ఏదికావాలన్న పొరుగు రాష్ట్రాల్లో పనులు చేసుకోవాలనుకునే ఆలోచనలు … చివరికి పెట్రోల్ కూడా పక్క రాష్ట్రాల్లో కొట్టించుకొస్తే ఎంతో కొంత మిగులుతాయని ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. యువత నిర్వీర్యం అయిపోయే దశకు వచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రజలకు ఓ హోప్ కావాలి. ఓ భరోసా కావాలి. ఓ ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే టీడీపీ యువ నాయకుడు రానా లోకేష్ నేనున్నానంటూ ప్రజలకు భ రోసా ఇచ్చేందుకు పాదయాత్రకు సంకల్పించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. కేవలం నడవడం కాదు.. లోకేష్ మరింత లోతుగా అధ్యయనం చేయబోతున్నారు. సమస్యల గురించి.. వాటి పరిష్కారం నుంచి తెలుసుకోబోతున్నారు. నాలుగు వందల రోజుల పాదయాత్ర.. స్కూలు, కాలేజీల్లో నేర్పని రాజకీయ , జీవిత అనుభవాల కష్టాలనే కాదు.. పరిష్కారాలనూ నేర్పుతుందని ఆశిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే అడుగులు ముందుకు వేయబోతున్నారు.
ఇప్పటి వరకూ పాదయాత్రలు వేరు – యువగళం పాదయాత్ర వేరు !
పాదయాత్ర ఎప్పుడూ సింపుల్ కాదు.. ఎవరు చేసినా ఆ ఎఫెక్ట్ ను తక్కువ అంచనా వేయలేరు. నేరుగాప్రజలతో మమేకం కావడం కన్నా ఓ రాజకీయ నాయకుడికి మేలు చేసే మరో రాజకీయ కార్యక్రమం ఉండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటాల నుంచి పాదయాత్రలు అనేవి ఓ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంగా మారిపోయాయి. గత ముఫ్పై ఏళ్లుగా ప్రతీ ఏడాది ఎన్నికలు వస్తున్నాయంటే.. ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పాదయాత్రల ద్వారా విజయాలు వస్తాయా రావా అన్న సంగతి పక్కన పెడితే.. తాను వస్తే సమస్యలు పరిష్కరిస్తానన్న భరోసా ఇవ్వగలిగితే.. ప్రజల ఆమోదం పొందవచ్చు. మాస్ లీడర్‌గా ప్రజల్లో స్థానం సంపాదించుకోవచ్చు. టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగువందల రోజుల పాటు జరగనుంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు వారికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమోదం ఉండకపోవచ్చు కానీ.. పాదయాత్రలో లభించే ప్రజామోదం మేరకు.. వారికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు సీఎం అభ్యర్థి కారు. కానీ ఆయన పాదయాత్ర ముగించిన తర్వాత.. ఆయనకు మించిన నాయకుడు కాంగ్రెస్‌లో కనిపించలేదు. పాదయాత్ర తెచ్చిన ఇమేజ్ అది. ఉండే పవర్ అది. తరాలు మారుతున్న రాజకీయంలో నారా లోకేష్ పాదయాత్ర బాధ్యతల్ని మీదేసుకున్నారు. తొలి అడుగులు వేశారు.
లోకేష్ సీఎం పదవి కోసం కాదు.. ప్రజల కష్టాలను తీరుతాయని భరోసా ఇవ్వడానికే !
నారా లోకేష్ సీఎం అభ్యర్థి కారు. ఆయన ప్రజల కోసమే అడుగులు ముందుకేస్తున్నారు. టీడీపీ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబే. టీడీపీ యువనేతగా.. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నేతగా లోకేష్ అడుగులు ముందుకేస్తున్నారు. ఆయన పాదయాత్రకు రాష్ట్రంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు పురికొల్పాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ వర్గం కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగులకు సమయానికి జీతాలొచ్చాయి. అనని వర్గాల కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపు ప్రకారం నిధులొచ్చేవి. ఆయా వర్గాల వారికి ఉపాధి లభించేది. పోలవరం, అమరావతి వంటి పనులు శరవేగంగా జరుగుతూ.. లక్షల కోట్ల అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తూ ఉండేది. ఇలాంటి పనులు జరిగి రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే అందులో పన్నుల రూపంలో నలభై శాతం మళ్లీ ప్రభుత్వానికే వస్తాయి. ఆ పనులన్నీ ఆపేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం.. ఇటు యువతకుఉపాధి పోయింది. అప్పట్లో యువతకు ఉద్యోగావకాశాలు వెల్లువలా వచ్చాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే లక్షన్నరకుపైగా ఉద్యోగాలొచ్చాయి అసలు వచ్చిన వాటిలో ఓ ఇరవై శాతం మాత్రమే ఇచ్చి ఉంటారు. ఐదేళ్లలో ఒక్క సారి ఆర్టీసీ చార్జీలు పెరగలేదు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయి.
నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న రాష్ట్ర ప్రజానీకం !
కానీ ఇప్పుడు రోడ్డెక్కని వర్గం లేదు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రజల మీద ప్రభుత్వం ఇప్పటికే రూ. పది లక్షల కోట్ల అప్పు పెట్టింది. కానీ ఒక్క రూపాయి సంపదను సృష్టంచలేదు. పేద ప్రజల వద్ద నుంచి మద్యం రేట్లు పెంచి వారి కుటుంబాలను ప్రభుత్వం దివాలా తీయించింది. వారి రక్తాన్నిపీలుస్తోంది. ఇక పెరగని చార్జీలు లేవు. ఆస్తి పన్ను.. ఆస్తి విలువతో పాటు పెంచుతూ పోతున్నారు. మధ్య తరగతి ప్రజల్ని పూర్తిగా లూటీ చేస్తూ.. కొంత వరకూ .. తమ ఓటు బ్యాంకుకు పంచుతూ.. వారు ఓట్లు వేస్తే చాలన్నట్లుగా పాలన సాగుతోంది. అంటే.. అందరి దగ్గర దోచుకుంటూ.. కొంత మందికి పంచుతూ పాలన సాగుతోంది. మరో వైపు ఓ కులాన్ని ఆర్థికంగా కుంగ దీయాలన్న కారణంగా తీసుకున్న నిర్ణయాలు అన్ని కులాలను ఆర్థికంగా కుంగ దీశాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల జీవితాల్ని తల కిందులు చేస్తున్నాయి. మరో వైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వైసీపీ చోటా నాయకుడు కూడా.. ఇప్పుడు పోలీసుల్ని బెదిరించే వారైపోయారు. ఓ వైపు ప్రభుత్వం దోపిడి.. మరోవైపు వైసీపీ నేతల దౌర్జన్యాలతో ప్రజలు సతమతమయిపోతున్నారు. నోరు తెరిస్తే గ్యారంటీ ఉండనది.. గుడ్ల నీరు కక్కుకుంటూ ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంతర్లీనంగా ఎవరూ ఊహించనంత ఉంది. కానీ.. ఇప్పుడు ప్రజలు ఆ భయాన్ని వదిలేయాలంటే.. ఓ భరోసా కావాలి.. ఆ భరోసా ఇచ్చే నేత కావాలి.
అందరి దగ్గరా నిలువు దోపిడీ చేసి ఓటు బ్యాంకుకు కొంత పంచుతున్న ప్రభుత్వం !
వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా గెలవాలని అనుకుంటుందో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓ స్పష్టత ఉంది. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ప్రభుత్వాధినేత .. టీనేజ్ లో ఉన్నప్పుడే ఏకంగా ఎస్ఐనే కొట్టి.. సెల్ లో వేశారు.. ఇప్పుడు ఆయనే పాలకుడు.. ఇక ఆయన వికృత మనస్థత్వానికి పోలీస్ పవర్స్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత మూడున్నరేళ్లుగా ప్రజల కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఎలా వినయోగిస్తారో చెప్పాల్సిన పని లేదు. వాటిని ఎదర్కొగలిగే శక్తి.. ధైర్యం.. మాకున్నాయని విపక్షాలు భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే్ ప్రజల బయటకు వచ్చి అండగా నిలుస్తారు. ఇప్పుడు నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదాయత్ర … ఆ భరోసాను ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. లోకేష్ యువకుడు.. ఆయన పూర్తిగా యవతతోనే యాత్ర చేస్తున్నారు. యువతతోనే మమేకం అవుతారు. రౌడీ రాజకీయాలు కాదని.. బతుకుల్ని బాగు చేసుకునే రాజకీయాలు చేసుకుందామని ఆయన పిలుపునివ్వబోతున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందే ఆయన.. కనీసం పాతిక వేల మందిని ముఖా ముఖిగా కానీ.. గ్రూప్ సమావేశాల ద్వారా కానీ కలిశారు. తనపై బయట జరిగే ప్రచారం వేరు.. అసలైన లోకేష్ వేరు అని ..అందరికీ చూపించారు. ఇప్పుడు ప్రజలకు చూపించబోతున్నారు. ప్రభుత్వం ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఈ విషయం.. అనుమతుల విషయంలోనే బయటపడింది. ఇప్పుడు లోకేష్ అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోబోతున్నారు.
కుట్రలు, కుతంత్రాలు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని ముందుకు సాగడమే అసలైన సవాల్ !
చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో ర్యాలీలు నిర్వహించి ఉంటారు కానీ.. కందుకూరులో జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదు. ఆ తర్వాత వెంటనే గుంటూరులో.. ఇవన్నీ.. యాధృచ్చికంగా జరిగాయని టీడీపీ నేతలు ఎవరూ నమ్మడం లేదు. ఈ విషయాన్ని అంచనా వేసుకుంటే.. లోకేష్ పాదాయత్ర ఎంత ఉద్రిక్తంగా సాగబోతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా స్పందన ఎంత ఎక్కువగా ఉంటే.. అంత తీవ్రమైన కుట్రలు జరిగి తీరుతాయి. అమరావతి రైతుల పాదయాత్ర ముందుకు సాగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి.. పాదయాత్రపై ఆంక్షలు వేధించేలా చేయగలిగారు. ఒక్క సారి ఆంక్షలు పెడితే ఇక పాదయాత్రను ఎలా ఆపగలమో పోలీసులు.. అమరావతి రైతుల పాదయాత్రతోనే నిరూపించారు. ఇక లోకేష్ పాదయాత్రపై ఆ వ్యహం పాటించరన్న అనుమానం ఎవరికీ లేదు. పోలీసులు ప్రతిపక్ష పార్టీని శత్రువులుగా చూస్తున్నారు. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి చేస్తే కేసుల్లేకపోగా..దాడులకు పాల్పడిన ఓ వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుంటే.. అతను డీజీపీ ఆఫీసులో పని చేసే సీఐగా తేలింది. అప్పటికి అడ్డుకోవడానికి పోలీు ఫోర్స్ రాలేదు కానీ.. దాడులు చేసే బృందంలో ఒకరిగా ఆ సీఐ వచ్చారంటే… పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పాదయాత్లో అటు వైసీపీ కుట్రల్నే కాదు.. ఇటు పోలీసుల ప్లాన్లను కూడా తిప్పి కొట్టాల్సి ఉంటుంది.
కుట్రలను ఎదుర్కుంటూ విజయవంతంగా ముందుకు సాగితే విజయమే !
పాదయాత్ర ఎంత సక్సెస్ ఫుల్ గా సాగితే… ప్రజల్లో అంత భరోసా వస్తుంది. నిజానికి సాఫీగా వచ్చే ఏ విజయానికైనా జీవిత కాలం తక్కువే. కష్టపడి .. మెట్టు మెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్నిస్తుంది. ఆ విజయానికి మనం అర్హులమనే అభిప్రాయాన్ని…నమ్మకాన్ని కలిగిస్తుంది. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి.. వారి అభిమానాన్ని సంపాదించుకుని.. తనపై ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేలా.. దిగ్విజయంగా నడిస్తే.. ఇక లోకేష్ తిరుగులేని నాయకుడు అవుతారు. లోకేష్ సామర్త్యం.. ప్రతిభపై ఆయన గురించి తెలిసిన వారు ఎవరికీ అనుమానాల్లేవు. కానీ ప్రజాస్వామ్యంలో గుర్తించాల్సింది ప్రజలు. వారికి లోకేష్ తాను ఎంత సమర్థుడ్నో చూపించాల్సి ఉంటుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పనితీరు మాత్రమే చూపించారు.. కానీ ఆ పని తీరు రాజకీయంగా ప్లస్ కాదు.. రాజకీయం వేరే. ఇప్పుడు లోకేష్ ఆ రాజకీయంలోనూ తాను దిట్ట నిరూపించుకునే సందర్భం పాదయాత్ర ద్వారా కల్పించుకున్నారు. రాజకీయాల్లో నేరస్తులు.. అవినీతి పరులు మాత్రమే మాస్ లీడర్లు కాదని.. స్టార్ ఫర్డ్ లో చదువుకున్న వారు కూడా.. మాస్ లీడర్లు అవుతారని.. నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని లోకేష్ కల్పించుకున్నారు.
ఒక్క మాట మాత్రం నిజం.. ఈ పాదయాత్ర పూలబాట మాత్రం కాదు.. ఓ వైపు దాడులు.. మరో వైపు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు.. మరో వైపు శారీరక శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని.. పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. అలాంటి అడ్డంకులు అధిగమించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. ఆల్ ది బెస్ట్ లోకేష్ !