ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం జగన్ శుక్రవారం రోజు తన పర్యటనలనురద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయిచిన రెండు పర్యటనలను రద్దు చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి హాజుర కావాల్సి ఉంది. అలాగే గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ నేత ఇంట పెళ్లికి కూడా వెళ్లాల్సి ఉంది. ఈ కార్యక్రమాలను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. కారణమేమిటో సీఎంవో వర్గాలు వెల్లడించలేదు.
కానీ సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగారని.. అవి లభించే అవకాశం ఉండటంతో… కన్ఫర్మ్ కాగానే ఢిల్లీకి బయలుదేరుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా.. ఇతర అంశాలపై కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన సమయం వచ్చిందని జగన్ భావించడంతో అత్యవసరంగా అపాయింట్ మెంట్లు అడిగారని అంటున్నారు. ఇతర పర్యటనల్లో ఉండగా అపాయింట్ మెంట్ ఖరారైతే…. అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లడం ఇబ్బంది కాబట్టి జగన్ పర్యటనలు రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి వచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ అటు రాజకీయంంగా ఇటు ప్రభుత్వ పరంగా క్లిష్ట సమస్యలు ఎదుర్కొంంటున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇరవై ఎనిమిదో తేదీన సీబీఐ ఏదుట హాజరు కానున్నారు. మరో వైపు రాజధాని కేసులపై 31న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఆర్థిక పరంగా ఇప్పటికీ ప్రభుత్వం ఓడీలో ఉంది. కానీ నెలాఖరు ముంచుకొస్తోంది… సామాజిక పెన్షన్లు, జీతాలకు ఆరేడు వేల కోట్లు కావాల్సి ఉంది. వీటి కోసం జగన్ ప్రయత్నించాల్సి ఉంది. అందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు.