బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారంటూ… ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన బీజేపీపై అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కేసీఆర్ ను ఎదిరించి… ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకు బీజేపీలో అనుకున్నంత ప్రాధాన్యత దక్కడం లేదు . చేరికల కమిటీ అనే పదవి ఇచ్చారు కానీ.. చేరుతున్నవారెవరూ లేరు. దీనికి కారణం సొంత పార్టీలో ఉన్న కోవర్టులేనని ఈటల అనుమానం. ఎవరితో అయినా చర్చలు జరిపితే వెంటనే… కేసీఆర్ కు తెలుస్తోందని.. అప్రమత్తమవుతున్నారని అందుకే చేరికలు ఉండటం లేదంటున్నారు.
ఈటల రాజేందర్ అసంతృప్తికి కారణం ఉంది. టీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈటల చాలా మందిని బీజేపీలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్ లోకి కనీసం అడుగు పెట్టే అవకాశం లేదని చాలా మంది నిరాశానిస్ప్రహల్లో ఉన్నారు. వారందరితో ఈటల టచ్ లోకి వచ్చారు. కానీ చేర్పించలేకపోయారు. అదే సమయంలో ఎవర్నీ పార్టీలోకి ఆకర్షించలేకపోయారని.. ఆయన వేస్ట్ అని ఇక్కడి నేతలు ఢిల్లీకి రిపోర్టులు ఇస్తున్నారు. దీంతో ఈటల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతోంది.
ఈ అసంతృప్తి బయటపడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈటలతో మైండ్ గేమ్ ప్రారంభించారు. బీజేపీలో ఉంటే కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం నెరవేరదని.. చెబుతున్నారు నేరుగా రేవంత్ .. ఈటల ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం లేదు. ఈటలను ఓడించాలంటే.. అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్న సంకేతాలను పంపుతున్నారు. అంటే పార్టీలోకి రావాలనే. ఈటల ఒక్కడే కాదు… మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి.. జితేందర్ రెడ్డిలకూ కూడా రేవంత్ సిగ్నల్స్ పంపుతున్నారు. వారు ఏ మాత్రం టెంప్ట్ అయినా.. రేవంత్ బీజేపీని గట్టి దెబ్బ కొట్టినట్లే అవుతుంది.