వైసీపీకి అంత సానుకూల వాతావరణం లేదని వరుసగా సర్వేలు వెల్లడవుతున్నాయి. వైసీపీ అత్యంత ఎక్కువగా నమ్మే ఇండియా టుడే… టీడీపీకి పార్లమెంట్ సీట్లు పది వరకూ వస్తాయని చెప్పింది. ఆరు నెలల కిందట జరిపిన సర్వేలో ఏడు సీట్లు వస్తాయని చెప్పిన ఇండియా టుడే…. తాజాగా.. పది సీట్లు వస్తాయని వెల్లడించింది. అంటే మార్పు వేగంగా ఉన్నట్లే. అదే సమయంలో ఐ ప్యాక్ మంత్రులు, మాజీ మంత్రుల నియోజకవర్గాల్లో చేసిన సర్వే అంట ఒకటి లీకైంది. ఐ ప్యాక్ వాటర్ మార్క్ తో ఉన్న ఆ సర్వే వైసీపీలోనూ కలకలం రేపుతోంది.
ఎలా చూసినా విపక్షాలు బలపడుతున్నాయని.. అధికారపక్షం ప్రజావ్యతిరేకతతో క్రమంగా బలహీనపడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది వైసీపీ నేతల్లో రకరకాల చర్చలకు కారణం అవుతోంది. వీలైనంత త్వరగా .. ఎన్నికలకు వెళ్తే బయటపడవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. విపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేదు. వాటి మధ్య పొత్తులు తేలలేదు. పొత్తులు తేలాలంటే చాలా సమయం పడుతుంది. అదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే… వారి పక్కా ప్రణాళిక ప్రకారం పొత్తులు పెట్టుకుని సాఫీగా పోటీ చేస్తారు.
విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహిపై యాత్ర చేయనున్నారు. చంద్రబాబు జిల్లాల టూర్లు తిరగనున్నారు. ఇలా విపక్షాలన్నీ ప్రజల్లోకి వెళ్తే .. వైసీపీ వెలవెలపోతుంది.
పొత్తులు లేకపోయినా గడ్డు పరిస్థితి ఉందని తాజాగా వెల్లడవుతోంది. పొత్తులు ఉంటే… ఇంకా చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే.. ముందస్తుకు వెళ్లడమే మార్గమన్న అభిప్రాయం వైసీపీ కింది స్థాయి వరకూ వ్యాపిస్తోంది. జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని… ఇప్పటికే కేంద్ర అనుమతి అడిగారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కింది స్థాయి వర్గాలకు ఉన్న స్పష్టతే.. హైకమాండ్ కూ ఉండటంతో… ముందస్తు ఎన్నికలు ఖాయమని వారు కూడా నమ్ముతున్నారు.