పవన్ కల్యాణ్ ను దూషించకుండా వైసీపీ నేతల రోజు గడవడం లేదు. పండగ అని లేదు… ఆదివారం అనలేదు.. వారు నోటికి పని చెప్పాల్సిందే. రాజకీయంగా ప్రత్యర్థి అయినంత మాత్రాన అంత దారుణంగా విమర్శిస్తారా అన్న అభిప్రాయం సామాన్యుల్లో వస్తోంది. ఇంతకూ పవన్ ఏం చేశారంటే.. టీడీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇతర పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ.. పొత్తు పెట్టుకుంటున్నారని ఇలా వ్యక్తిగత హననానికి పాల్పడటం మాత్రం రాజకీయాల్లో కొత్త ధోరణే. రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్ విమర్శించారని మళ్లీ అదే పని చేశారు. పవన్ విధానాల పరంగా ప్రశ్నిస్తే.. వారు కూడా ఆ పద్దతిలోనే స్పందించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు.
వైసీపీ నేతల దారుణ వ్యాఖ్యల కారణంగా పవన్ కల్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అదే తరహాలో విమర్శిస్తున్నారు. ఈ కారణంగా పవన్ కు ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైఎస్ఆర్సీపీకి తెలియదా అంటే…తెలియదని.. అంచనా వేయలేదని అనుకోలేం. వైసీపీ నేతలు ఆయనను ఓ కులానికి పరిమితం చేయడానికో.. లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయడానికో ఈ విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ అధికారానికి ఇబ్బంది ఎదురవుతుందని ఫ్రస్ట్రేషన్ కు గురి కావడమేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.పవన్ ఒంటరిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలి వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని వారి ప్లాన్ కావొచ్చు.
పవన్ కు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి విమర్శలు చేయడం వెనకు వైఎస్ఆర్సీపీ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ ను బలవంతుడిగా చూపించడం వల్ల తనకు క్రేజ్ పెరిగిందని పార్టీకి ఆదరణ పెరిగిందని జనసేన అనుకుంటే టీడీపీని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయవచ్చు. అప్పుడు రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయి. చివరికి పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సాఫీగా సాగదని ప్లాన్ కావొచ్చని అంటున్నారు. మొత్తంగా వైసీపీ రాజకీయం మాత్రం.. ఎవరూ ఊహించని విధంగా ఉంటోందని అర్థం చేసుకోవచ్చు.