నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు.
లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక తెదేపా నేతలు ఆయన్ను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.