అదానీ కంపెనీలన్నీ గాలి మేడలని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన రిపోర్టు విషయంలో … అదానీ సంస్థలు ఎదురుదాడి చేయడంలో విఫలం కావడంతో ఇన్వెస్టర్లలో ఒక్క సారిగా ఆందోళన ప్రారంభమయింది . రీసెర్చి .. తాము ప్రకటించిన వివరాలు తప్పయితే..తమపై న్యాయపోరాటం చేయాలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సవాల్ చేసింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుండి అదే పనిగా అమ్మకాలు కొనసాగాయి.
అదానీ లిస్టెడ్ కంపెనీలన్నీ భారీ నష్టాల్లో ముగిశాయి. ఒకటి .. అరా కాకుండా ఏకంగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకూ షేర్ల ధరలు పడిపోయాయి. దీంతో అదానీ గ్రూప్ విలువ ఇరవై శాతం వరకూ పడిపోయింది. అదానీ నిర్వాకంతో పాటు.. ఇతర సెంటిమెంట్లు కూడాతోడు కావడంతో స్టాక్ మర్కెట్ లో రక్తకన్నీరే ప్రవహించింది. రెండు రోజుల్లో కనీసం పదకొండు లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు నష్టపోయారు. అదానీ గ్రూప్ అత్యధికంగా నష్టపోయింది. హిండెన్ బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే ఈ బ్లడ్ బాత్ అని భావిస్తున్నారు.
అదానీ గ్రూప్ షేర్లు అత్యధికంగా ప్రభుత్వ రంగబ్యాంకులు, ఎల్ఐసీ వద్ద ఉన్నాయి. అవి మార్కెట్లలో ఇంకా అమ్మకాలు ప్రారంభించలేదు. అవి ప్రారంభిస్తే షేర్ ధర మరింత పతనమవుతుంది. కానీ కేంద్రం వాటి అమ్మకాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇతర షేర్ హోల్డర్లు మాత్రం వీలైనంత త్వరగా అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పరిస్థితులు కూడా కలిసి రావడం లేదు. దీంతో పతనం మరింత కొనసాగుతుందన్న ఆందోళనలో మార్కెట్ వర్గాలున్నాయి.
అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక విషయంలో గట్టిగా ఎదురుదాడి చేయకపోతే.. ఆ సంస్థ బయట పెట్టినవన్నీ నిజాలేనని ఇన్వెస్టర్లు నమ్ముతారు. అదే జరిగితే ఇక అదానీ.. కోలుకోవడం కష్టం.