నారా లోకేష్ ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. తాను చేస్తున్న రాజకీయం.. అసలు అందరూ అనుకునే రాజకీయం కాదని.. ప్రజల కోసం.. రాష్ట్రం కోసమే రాజకీయం అనే సందేశాన్ని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువగళం తొలిరోజు ఏర్పాటు చేసిన బహిరంగసభ స్పీచ్‌లో లోకేష్.. పూర్తిగా రాష్ట్ర సమస్యలపైనే మాట్లాడారు. అయితే అందులోనూ తనదైన మార్క్ చూపించారు. ఎక్కడా తడబడకుండా.. మంత్రులకు కౌంటర్లు ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని జాదూరెడ్డి అని పేరు పెట్టి.. పాలనా వైఫల్యాల్ని ఎత్తి చూపారు. యువగళం పేరు ప్రకటించిన వెంటనే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయని ఎద్దేవాచేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల పనులు చేశానని యువతకు ఉద్యోగాలు ఇప్పించానన్నారు. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు , ఎన్టీఆర్, చంద్రబాబు వల్ల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. మూడు రాజధానులు పేరుతో కాలక్షేపం చేశారు కానీ ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు.
యువతను ప్రధానంగా ఆకట్టుకోవడానికి లోకేష్ చేస్తున్న పాదయాత్ర కావడతో యువత కోసం త్వరలో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తనకు చీర, గాజులు పంపిస్తామని ఓ డైమండ్ అన్నారని.. వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని కౌంటర్ ఇచ్చారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. జే బ్రాండ్‌తో మహిళల మంగళసూత్రాలు తెంపుతున్న జాదూరెడ్డి అని జగన్‌పై మండిపడ్డారు. ఏపీని రైతులు లేని రాజ్యం చేస్తున్నారని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.
ఏడాదిలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారని అవి ఏమయ్యాయయని ప్రశఅనించారు. జే ట్యాక్స్ కట్టలేదని పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని తప్పుబట్టారు. ‘జే ట్యాక్స్ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై.. బై.. ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయి’ అని లోకేష్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తే.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు.
మీరు చేసిన దానికి వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని.. మీ చేత కక్కించే ప్రతి రూపాయి కుప్పంలో పేద ప్రజలకు ఖర్చు చేస్తానని ప్రకటించారు. మీ జీవో నెంబర్ 1 మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు.. ఈ యువగళం ఆగదు…మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వారాహి ప్రస్తావన కూడా తీసుకు వచ్చి.. లోకేష్.. భవిష్యత్‌లో తమ దారి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారని అనుకోవచ్చు.
లోకేష్ పాదయాత్ర కోసం టీడీపీ శ్రేణులు అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చారు. ప్రారంభంలో వేల మంది కార్యకర్తలు లోకేష్ తో పాటు నడిచారు. తొలి రోజు ఎనిమిదిన్నర కిలోమీటర్ల వరకూ నడిచారు.