వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జాతీయ మీడియాలో మంచి మిత్రులు ఉన్నారు. ప్రజల సొమ్ముతో ఆయన కొన్ని ఒప్పందాలు ఆయా మీడియా సంస్థలతో చేసుకోవడమే కాదు.. వ్యక్తిగతంగా టాప్ జర్నలిస్టులతో జగన్ తరపున కొంత మంది సన్నిహితంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో జగన్ కు వ్యతిరేకంగా సర్వేలు వచ్చే అవకాశం దాదాపుగా ఉండదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారిపోయింది. ఏపీలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోతోందని సర్వేలు ప్రకటిస్తున్నాయి.
జగన్ కు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండే మీడియా ఇండియా టుడే. కారణం ఏదైనా కావొచ్చు కానీ గత ఎన్నికలకు ముందు నుంచి జగన్ పరిస్థితి బాగుందని ఎప్పటికప్పుడు సర్వేలు ఇచ్చేది. ఎన్నికల ఫలితాలు అలాగే వచ్చేవి . జగన్ తిరుగులేని విజయం సాధించిన తర్వాత రెండేళ్లలో ఓ ఏడు.. అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రి కిరీటం కూడా పెట్టారు. కానీ ఇప్పుడు జగన్ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఇప్పుడు ప్రజలకు నుంచి ఆయనకు లభిస్తున్న ఆదరణ అత్యంత లీస్ట్ లో ఉంది. అది 39 శాతంగానే అని తేలింది. ఏడాదిలోనే ఇరవై శాతం వరకూ ఆదరణ కోల్పోయినట్లుగా తేల్చింది
రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ కు 73 శాతం ప్రజల ఆదరణ ఉంది. అధికార వ్యతిరేకత సహజమే అనుకోవచ్చు… కానీ కేజ్రీవాల్, బిశ్వశర్మ, భూపేష్ భాగెల్, శివరాజ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ వంటి ముఖ్యమంత్రులు తమ రేటింగ్ మెరుగుపర్చుకున్నారు. వీరిలో రెండో సారి సీఎం అయిన వారు కూడా ఉన్నారు. కానీ జగన్ పరిస్థితి మాత్రం రాను రాను దిగజారిపోతోంది.
యాభై శాతం ఓట్లతో.. 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్లకే ఇలా ప్రజాదారణ కోల్పోవడానికి కారణం ఆయన ప్రజలను వంచించడమే. అధికారంలోకి వస్తే ఏం చేస్తానని చెప్పారో… అది ఒక్కటి కూడా చేయలేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. జగన్ రావడం .. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల వ్యక్తిగత ఆస్తుల విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా ప్రజలంతా లక్షల కోట్లు నష్టపోయారు. ఇంతా చేసిన సరైన పాలన అందించారా అంటే.. తాడేపల్లి నుంచి బయటకు రాని పాలన చేస్తున్నారు. ఒక్క పాలసీ కరెక్ట్ గా ఉండదు. ఇబ్బంది పడని వర్గం లేదు . ఎలా చూసినా జగన్.. ప్రజలను వంచించారు. దానిపై వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికల సమయానికి ఈ అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందనేదానిపైనే ఎన్నికల ఫలితాల తీవ్ర ఆధారపడి ఉంటుంది.