ఏపీలో వైసీపీ పాలనలో ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఫేక్ జీవోలు ఒకటి. అసలు ప్రభుత్వ జీవోలను ప్రభుత్వమే దాచి పెట్టుకుంటూ ఉంటుంది. అసలు ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు తెలియకుండా ఉంచి సీక్రెట్ గా అమలు చేయడం ఏమిటనేది చాలా మందికి వచ్చే సందేహం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అయినా ప్రజలకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదనేది ప్రభుత్వ లాజిక్. ఆ ప్రకారం జీవోలన్నీ సీక్రెట్ గా ఉంచుకుంటూ ఉంటుంది.
కానీ ఫేక్ జీవోలు మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని జీవోలు వైరల్ అయ్యాయో లెక్క లేదు. తాజాగా ప్రభుత్వం పదవీ విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై మూడుకు పెంచబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అధికారవర్గాలు మీడియాకు చెప్పాయి. ఇదే విషయాన్ని మీడియా చెప్పింది. కానీ కొంత మంది ఇదే అదనకు.. అరవై ఐదేళ్లకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ జీవో ఇచ్చినట్లుగా ఫేక్ జీవోను వైరల్ చేశారు. ఇది నిజమేనని నమ్ముకుని కొన్ని మీడియా సంస్థలు ప్రకటనలు చేశాయి.కానీ ఇదే సందనుకున్నట్లుగా ఫేక్ జీవో అంటూ అధికారులు కేసులు పెట్టారు.
అసలు జీవోలను సీక్రెట్ గా ఉంచడం ఎందుకు… సర్క్యూలేట్ అయ్యేవాటిని ఫేక్ గా కేసులు పెట్టడం ఎందుకు అనేదానిపై ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. జీవోఐఆర్ వెబ్ సైట్ ను పూర్తిగా నిలిపివేశారు. పారదర్శకత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వం ఎప్పుడు.. .. ఏ ఆస్తులను తాకట్టు పెడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి వాటికి ఇచ్చే జీవోలను పరువు తీస్తాయని ప్రభుత్వం అనుకుని జీవోలను సీక్రెట్ గా ఉంచుతోంది. నిజంగా అవి పరువు తీసేవే అయితే అసలు ప్రభుత్వం చేయడం ఎందుకు అనే లాజిక్ మనకు వస్తుంది కానీ.. పాలకులకు రాదు. ఎందుకంటే.. వస్తే అసలు చేయరుగా !