ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు ఉండవని ప్రకటనలు చేస్తూంటారు. అసలు టీడీపీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పలేదు. కనీసం అలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పలేదు. కానీ .. విపక్షాలు ఇతర పార్టీలు మాత్రం బీజేపీతో పొత్తు కోసం ప్రయ.త్నిస్తున్నాయని ప్రచారం చేస్తున్నాయి. ఆ వెంటనే బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు పెట్టుబోకోమని ప్రకటనలు చేస్తున్నాయి. కానీ టీడీపీ స్పందించడం లేదు.
బీజేపీతో పొత్తును టీడీపీ క్యాడర్ కూడా కోరుకోవడం లేదు. యంత్రాంగంతో అరాచకం సృష్టిస్తారన్న డౌట్ తోనే … ఎన్నికలు నిష్ఫాక్షికంగా నిర్వహిస్తారన్న ఆశతోనే బీజేపీతో పొత్తు అనే మాటలు వినిపిస్తున్నా టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. జనసేనతో పొత్తు ఖాయమని టీడీపీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. బీజేపీ కూడా కలిస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయా ఆన్న ఆలోచన చేయడం లేదు. కూటమిలో బీజేపీ చేరినా చేరకపోయినా ఫలితాల్లో పెద్దగా మార్పు వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే బీజేపీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉంటుందన్న అర్థంలో తీర్మానం చేశారు. దీంతో బీజేపీ టీడీపీకి పొత్తు సంకేతాలు పంపిందని.. తమకు కూడా అంగీకారమేనన్న అభిప్రాయం చెప్పిందని రాజకీయవర్గాలు అంచనా వేయడం ప్రారంభించాయి. ఏపీ బీజేపీలో పొత్తు ఉండదని కొంత మంది నేతలు బహిరంగంగా చెబుతున్నారు… కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాల్సిందేనని.. కొంత మంది బీజేపీ నేతలు హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పొత్తుపై ఏపీ బీజేపీలోని రెండు వర్గాలు తమదైన ప్రయత్నాలను ఢిల్లీలో చేస్తున్నారని అంటున్నారు. వారి ప్రకటనలతో తమకేం సంబంధం లేనట్లుగా టీడీపీ నేతలు ఉండటంతో వారు మరింతగా ఉత్సాహంగా ప్రకటనలు చేస్తున్నారు.