తాము వచ్చాకే ఏపీకి అంబానీ , అదానీలు వస్తున్నారని జగన్ గతంలో ఓ సభలో ఘనంగా ప్రకటించుకున్నారు. నిజంగానే వచ్చారు. అంబానీ ఓ సారి నేరుగా జగన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి తన సహచరుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటిప్పించుకున్నారు. కానీ పెట్టుబడులు పెట్టలేదు. చంద్రబాబు హయాంలో ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడులనూ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు. అదానీ కూడా వచ్చారు. రహస్యంగా జగన్ ను తాడేపల్లి ఇంట్లో రెండు, మూడు సార్లు కలిశారు. కానీ ఎందుకు కలిశారో తెలియదు.
గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఉన్న పదిశాతం వాటాను అప్పనంగా కట్టబెట్టేశారు. ఈ లావాదేవీ సీక్రెట్. ప్రభుత్వం మారితేనే బయటకు వస్తుంది. ఇక విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్మధురవాడలో 130 ఎకరాలు కేటాయించడమే కాదు ఏకంగా సేల్ డీడ్ రాసిచ్చేశారు. అక్కడ డేటా సెంటర్ ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ భూమి మాత్రం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లుకూడా అప్ప చెప్పబోతున్నారన్నప్రచారం జరుగుతోంది.
ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ పేరుతో కడప, సత్యసాయి, పార్వతీపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు. ఇతర రాయితీలు కల్పించి పెట్టుబడులు పెడతారని ప్రకటించారు. అవి ఇప్పుడల్లా ముందడుగుపడే అవకాశం లేదు. భావన పాడు పోర్టు… మచిలీపట్నం పోర్టులను కూడా అదానీకేనని చెబుతున్నారు. అయితే ఏ ఒక్క అంశంలోనూ అదానీ ఒక్క రూపాయి కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదానీ సంస్థలు కోలుకోకపోతే… రుణాలు చెల్లించడంలోనూ డీఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఆ సంస్థ పెట్టుబడులు ఎలా పెట్టగలదు ?