ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి ఇస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు 2022 డిసెంబర్ 26న తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని ..ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు.
దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు. ఈ తీర్పు కేసీఆర్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ అనుకోవచ్చు. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. హైకోర్టు తీర్పు తర్వాత రంగంలో దిగాలని వెయిట్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ఇప్పుడు సీబీఐ వెంటనే రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే సంచలనం నమోదవుతుంది. ముందుగా … ఫిర్యాదు చేసిన వారిని ప్రశ్నించవచ్చు. ఈ కేసులో చెబుతున్న రూ. వందల కోట్ల డీల్స్ కు నిధులు ఎక్కడివని.. బయటకు తీసే అవకాశం ఉంది. నిజానికి సీబీఐకి కేసు వెళ్తే ఎలాంటి మలుపులు తిరుగుతుదో అంచనా వేయడం కష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది బీజేపీ నేతలవైపు కాదు.. .ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల వైపే విచారణ గురి పెట్టి ఉంటుంది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.