సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన వారిలో అలీ కూడా ఉన్నారు. అయితే తనకు జగన్ టిక్కెట్ ఇస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. రాజమండ్రిపై ఆశలు పెట్టుకుని ఆయన ఆ నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నారు. చిన్న చిన్న ఈవెంట్లకు ఎవరు పిలిచినా వెల్తున్నారు. ఓ చిన్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడానికి రాజమండ్రి వెళ్లిన అలీ.. అక్కడ మీడియాతో తనకు టిక్కెట్ ఇస్తారని మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు.
మా నాయకుడు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఎక్కడ పోటీ చేస్తాం అనే దానిపై పుకార్లు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే తాను సిద్ధమని ఆఫ్ ది రికార్డుగా ఆయన చెబుతున్నారు. అయితే ఎంపీ స్థానానికి ఖర్చు పెట్టాలంటే.. అలీకి చేతులు రావని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతూంటారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఇలా ఎక్కడ మైక్ కనిపించినా తన కోరిక వెల్లడిస్తున్నారు.
మొత్తంగా ఆలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అలీ కోరికను జగన్మోహన్ రెడ్డి తీరుస్తారో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే.. నియోజకవర్గాల్లో చాలా మందికి పని చేసుకోమని చెప్పారు. అలా అలీకి ఏమీ చెప్పకపోవడంతో ఆయన ఎక్కడా ఇంకా ఎన్నికల పని ప్రారంభించలేదు.