ఈనెల 24న అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్న రాహుల్ గాంధీని అడ్డుకొంటామని కొందరు తెదేపా నేతలు హెచ్చరించారు. కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముందుగా స్పందించి ఉండాలి. కానీ తెలంగాణాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు ముందుగా స్పందించడం విశేషం. తమ నాయకుడిని ఎవరయినా అడ్డుకొనే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కానీ అది తమ పార్టీ అధినేతపై ఉన్న గౌరవంతోనో లేక పార్టీ తరపున పోరాడాలనో ఆయన ఉద్దేశ్యం కాదనే భావించవచ్చును.
ఆయన మొదటి నుండి సోనియా, రాహుల్ గాంధీలకు భజన చేస్తూనే కాలక్షేపం చేసారు. త్వరలో రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేప్పట్టిన తరువాత తనవంటి వృద్ద నేతలందరినీ పక్కనబెట్టే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ని పక్కనబెట్టి ఆకుల లలితను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో ఆ విషయం రుజువయింది. అదే జరిగితే పార్టీలో అందరి కంటే చాలా సీనియర్ మరియు వృద్ధుడు అయిన హనుమంత రావుని కూడా రాహుల్ గాంధీ పక్కనబెట్టవచ్చును. బహుశః అందుకే ఆయన రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డట్లున్నారు.
కానీ హనుమంతుడు రాహుల్ గాంధీ పట్ల ఎంత భక్తి, వినయ విధేయతలు ప్రదర్శించినా ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చును. ఇంతకాలం హనుమంత రావు వంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో, రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారు. కనుక రాహుల్ గాంధీ పొమ్మని చెప్పే వరకు పదవులు, కుర్చీలు పట్టుకొని వ్రేలాడకుండా గౌరవంగా తప్పుకొని యువతకి (అంటే తమ కొడుకులు, మనవళ్ళకి కాదు) చోటు కల్పిస్తే బాగుంటుందేమో? అలాగయినా కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కడుతుందేమో?