అక్కడక్కడా ఉపఎన్నికలు జరిగితే టూరిస్ట్ బస్సుల్లో ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవచ్చు.. . కానీ రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగితే కష్టం.. అందుకే అధికార పార్టీ కొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే ఓట్ల తొలగింపు. ధర్మవరం నియోజకవర్గంలో కేవలం రెండు గ్రామాల్లోనే ఐదు వందల ఓట్లను తొలగించిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. గతంలో పయ్యావుల కేశవ్ నియోజకవర్గం ఉరవకొండలో ఇలాగే ఓట్లు తీసేస్తే.. మొదట అదేం లేదని బుకాయించిన అధికారులు.. కేంద్ర ఎన్నికల సంఘం నుండి ప్రతినిధి వచ్చే సరికి ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేశారు. అంటే ఓట్ల తొలగింపు అనేది నిజమని ఒప్పుకున్నట్లే. అలా ఒక్క చోట కాదు.. వ్యవస్థీకృతంగా జరుగుతోందని తాజాగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో ఉపాధి లేక పనుల కోసం వలస వెళ్లడం సహజం. ఇలా వలస వెళ్లిన వారు…. కూలి పని చేసుకుని సీజన్ మారగానే గ్రామాలకు చేరుకుంటారు. వారు ఇతర చోట్ల ఇళ్లు కొనుక్కుని స్థిరపడిపోయే పరిస్థితి ఉండదు. కానీ వారి ఓట్లను టార్గెట్ చేసుకుని ప్రధానంగా తీసివేతలకు దిగుతున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఓట్ల తొలగింపు వివాదాలు ప్రారంభమవుతున్నాయి. నిజానికి ఇలాంటి వారు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకునేంత తీరిక ఉండదు. ఇతర రాజకీయ పార్టీలే ఈ జాబితాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని చోట్ల ఆయా గ్రామాల్లో ఓటర్ జాబితాల్లో తీసివేతలు సంచలనంగా మారుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ గ్రామాలను యూనిట్ గా తీసుకుని ఓటర్ జాబితాల పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్తగా చేర్చిన ఓటర్లు ఎవరు.. తీసేసిన ఓటర్లు ఎవరు అన్నది గ్రామాల వారీగా లెక్కలు తీస్తే… న్యాయపోరాటం చేయడానికి అవకాశం ఉంటుదన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ 7 పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలే ప్రయత్నం చేశారు. ఆ కేసు సంచలనం అయింది. కానీ వైసీపీ మారిన తర్వాత పక్కన పెట్టారు. ఆ దరఖాస్తులు ఎక్కువగా బీహార్ నుంచి అప్ లోడ్ అయ్యాయి. ఇప్పుడు అధికారంలో ఉండగా.. కామ్ గా ఉంటారని అనుకుంటే అది టీడీపీ అమాయకత్వం అవుతుంది.
వాలంటీర్ల కు గత వారం రోజులుగా.. టీడీపీ అనుకూల ఓటర్ల ను గుర్తించడమే టాస్క్ గా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఓట్ల తొలగింపు నిజమైతే… ప్రజాస్వామ్యం .. నియంతృత్వమవుతుంది.