మీకు దర్యాప్తు సంస్థలున్నాయి.. నాకూ ఉన్నాయంటూ కేసీఆర్ చాలెంజ్ చేసి మరీ… ఫామ్ హౌస్ కేసును… ఢిల్లీ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందో లేదో తెలియదు కానీ…. సీబీఐ విచారణ నుంచి మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదని న్యాయవర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి. ఫామ్ హౌస్ కేసు అత్యంత క్లిష్టమైనదేమీ కాదు.. కానీ ట్రాప్ అని స్పష్టంగా తెలుస్తోంది. పెద్దగా బీజేపీతో సంబంధాల్లేని ముగ్గుర్ని తెరపైకి తెచ్చి … ఏకంగా బీజేపీ హైకమాండ్‌తో లింక్ పెట్టి .. కేసు కట్టేశారు. వందల కోట్లు అన్నారు కానీ రూపాయి కూడా పట్టుబడలేదు.
కానీ కేసీఆర్ అత్యుత్సాహం వల్ల ఆయన కూడా ఇప్పుడు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. సాక్ష్యాలను ఆయన మీడియా సమావేశం పెట్టి రిలీజ్ చేశారు. వాటిలో ఉన్న కంటెంట్ వైరల్ కాలేదు కానీ.. ఆయన ఇలా చేయడం మాత్రం సీబీఐ దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.ఆయనను సీబీఐ విచారించడం ఖాయమని ఇప్పటికే స్పష్టమయింది. ఇక .. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు కూడా ఇబ్బందులు పడనున్నారు. స్టీఫెన్ రవీంద్ర .. సీబీఐ గుప్పిట చిక్కడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టీఫెన్ పై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సిట్ కు నేతృత్వం వహించిన సీవీ ఆనంద్ ని కూడా సీబీఐ ప్రశ్నించవచ్చంటున్నారు.
సీబీఐ విచారణలో ముందుగా నలుగురు ఎమ్మెల్యేలనూ ప్రశ్నిస్తారు. ఈ సీబీఐ విచారణపై ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో అసలేం జరుగుతుందన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీబీఐ విచారణ అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ కేసును చూపించి బీజేపీ పెద్దలతో వైరం పెట్టుకోవడం…. వదిలేది లేదని వారు హెచ్చరించినందున… తమకు ఆయుధం అవుతుందనుకున్న ఏ కేసు నుంచి వారు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.