అల్టిమేట్ గా ఫ్యాక్ట్ చెకర్ గా కేంద్రం మారిపోయింది. తాము ఏది ఫేక్ అని తేలిస్తే అది ప్రచారం చేయకూడదని.. ఆ న్యూస్ ఇక ప్రచారం చేయకూడదని.. కేంద్రం రూల్స్ తీసుకొచ్చింది. సమాచార చట్టాన్ని సవరిస్తూ మోడీ సర్కార్ కొద్ది రోజుల క్రితం ముసాయిదా ప్రతిని సిద్ధం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏదైనా వార్తను ‘ఫేక్’ అని నిర్ధారిస్తే..సామాజిక మాధ్యమాలు, వార్తా వెబ్‌సైట్స్ ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదని ముసాయిదా చట్టంలో నిబంధనల్ని చేర్చారు.
కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి సవరణలు చేసి ముసాయిదా ప్రతిని జారీచేసింది. పీఐబీలోని ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌కు ‘నకిలీ వార్తల’ను గుర్తించే పని అప్పగించింది. ఇలా గుర్తించిన వార్తల్ని సోషల్‌మీడియా, న్యూస్ వెబ్‌పోర్టల్స్ ప్రచురించరాదు. ఒకవేళ ప్రచురిస్తే.. వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీ అయిన పీఐబీకి న్యాయ అధికారం కల్పించటాన్ని మీడియా సంఘాలు తప్పు పడుతున్నాయి. కానీ.. ఇప్పుడు మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో అందరికీ తెలుసు కాబట్టి… ప్రకటనలకే ఇది పరిమితమవుతుంది.
సాధారణంగా ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఫేక్ గా చెబుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు కాదు. తమపై వ్యతిరేక ప్రచారం చేయకుండా.. నేరుగా మీడియాను నియంత్రించేందుకు ఈ నిబంధనలు తెస్తున్నట్లుగా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రముఖ జర్నలిస్టు, మీడియా సంఘాలు ఈ నిబంధన కరెట్ కాదని చెబుతున్నాయి. వివాదాస్పద అంశాల్ని ముసాయదా చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.