ఏపీ మంత్రి రోజా ప్రతీ వారం శ్రీవారి దర్శనానికి వెళ్తూంటారు. మంత్రి కాక ముందు ఈ దర్శనం రెగ్యులర్ గా ఉండేది. మంత్రి అయిన తర్వాత కూడా నెలలో రెండు, మూడు సార్లు తిరుమలలో కనిపిస్తూంటారు. అక్కడే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. ఇన్ని సార్లు రోజా శ్రీవారిని దర్శించుకోవడం ఏమిటని సామాన్య భక్తులు కూడా ఆశ్చర్యపోతూంటారు. అయితే ఇలా ఆమె రెగ్యులర్గా దర్శనానికి వెళ్లడానికి కారణం.. వీఐపీ ప్రోటోకాల్ టిక్కెట్లంటున్నారు టీడీపీ నేత ఆనం వెంకరమణారెడ్డి.
రోజా మంత్రి. ఆమె వెళ్తే ప్రోటాకాల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. ఆమెతో పాటు వచ్చిన అనుచరులకూ ప్రోటోకాల్ దర్శనం లభిస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందని.. ఆనం వెంకటరమణారెడ్డి చెబుతున్నారు. తనతో వచ్చే వారి దగ్గర నుంచి ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్లను ఆమె అమ్ముకుంటున్నారని ఆయన అంటున్నారు. అంతే కాదు.. మంత్రి అయిన ప్రతి నెలా దుబాయ్, కువైట్ వెళ్తున్నారని ఎలా ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని చేశారు.
లోకేష్ పాదయాత్ర నగరి నియోజకవర్గానికి చేరుకుంది. పాదయాత్రలో పాల్గొన్న వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడినప్పుడు రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. రోజా గురించి తాను నగరి నియోజకవర్గం మొత్తం మీద ప్రజాభిప్రాయం సేకరించానని, వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. విజయపురం మండలం, పాతార్కాడు, కోసల నగరం గ్రామాల్లో దాదాపు వందల ఎకరాల భూమిని రోజా కబ్జా చేశారని ఆరోపించారు.