టీడీపీ యువ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్లకు చేరుకుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇందులో వినూత్నంగా తాను ఆ వంద కిలోమీటర్ల పరిధిలో ఇచ్చిన హామీలను చెక్కిస్తున్నారు. అదికారంలోకి వచ్చిన వెంటనే వాటిని చేయిస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు సీఎం జగన్ నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. ఇలా ఐదారు వందలకుపైగా ఉంటాయి. కానీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టలేదు. ఇప్పుడు మేనిఫెస్టోనే అమలు చేస్తానని చెబుతున్నారు.
దీంతో పాదయాత్రలో హామీలు పొందిన అనేక వర్గాలు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. కానీ ఆయన ఇంటి చుట్టూ శాశ్వతంగా నిషేధాజ్ఞలు విధించారు. వారంతా తాము మోసపోయామని అసంతృప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము ఎలాంటి హామీలు ఇవ్వలేదని.. కావాలంటే మేనిఫెస్టో చూసుకోమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాంటివి మన దగ్గర ఉండవని.. మాటంటే మాటేనని లోకేష్ నిరూపించేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తాను ఇస్తున్న హామీలను ప్రతి వంద కిలోమీటర్ కు శిలాఫలకంపై చెక్కించి పెడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకపోతే.. ఆ శిలాఫలాకాలను చూపించి.,.. ప్రశ్నించే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ఇచ్చిన హామీలన్నింటినీ తాను అమలు చేయగలనని నమ్మకం లోకేష్ కల్పిస్తున్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తానో కూడా చెబుతున్నారు. లోకేష్… పాదయాత్ర ప్రజల్ని ఆకట్టుకోవడానికి.. ప్రజల నుంచి మంచి స్పందన రావడానికి ఆయన సమస్యలపై స్పందిస్తున్న వైఖరి కూడా ఓ కారణం అని భావిస్తున్నారు.