నిర్మాతగా బండ్ల గణేష్ ప్రయాణం.. రవితేజ సినిమాతోనే మొదలైంది. ఆంజనేయులు సినిమాతో మొదలైంది. ఈ సినిమా కమర్షియల్గా గిట్టుబాటు అయ్యేసరికి నిర్మాతగా కొనసాగగలిగాడు. ఆ తరవాత… తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు తీశాడు. తీన్మార్ ఫ్లాప్ అయినా…గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తరవాత ఎన్టీఆర్తో బాద్షా, టెంపర్ తీశాడు. అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాకీ ఆయనే నిర్మాత. మొత్తానికి క్రేజీ ప్రాజెక్టులకు పని చేయగలిగాడు. కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. తాను నిర్మాతగా ఎక్కడైతే ప్రయాణం ప్రారంభించాడో.. మళ్లీ అక్కడి నుంచే.. నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు.
రవితేజతో ఓ సినిమా చేయడానికి గణేష్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. రవితేజ కూడా.. గణేష్తో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడట. ఇటీవల రెండు మూడు కథలు రవితేజకు వినిపించినట్టు టాక్. గోపీచంద్ మలినేని సైతం.. రవితేజకు ఓ కథ చెప్పాడట. బలుపు, క్రాక్లతో వీరిద్దరూ రెండు హిట్లు కొట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తే..హ్యాట్రిక్ అయిపోతుంది. కాంబోకి కూడా క్రేజ్ వస్తుంది. మరి బండ్ల అదృష్టం ఎలా ఉందో చూడాలి.