ఈరోజుల్లో 50 రోజుల పోస్టర్లు చూడడం అరుదైన విషయమే. ఇది ఓటీటీ జమానా. విడుదలైన మూడు వారాల్లోనే సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. దాంతో లాంగ్ రన్ మరింత కష్టమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీర సింహారెడ్డి 50 రోజులు ఆడేసింది. 54 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకొంటోంది. ఇందులో 23 కేంద్రాలు డైరెక్ట్‌గా ఆడాయి. మిగిలినవి షిఫ్టింగ్ లో ఆడాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య గెటప్, ఆయన చెప్పిన పొలిటికల్ డైలాగులు బాగా పేలాయి. పాటలు విడుదలకు ముందే హిట్టవ్వడం కలిసొచ్చింది. పైగా సంక్రాంతి సీజన్. ఇవన్నీ… బాలయ్య సినిమాకి ప్లస్ అయ్యాయి. సంక్రాంతి సీజన్ ముగిశాక కూడా… ఈ సినిమా జోరు చాలా చోట్ల కొనసాగింది. ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకొంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. రెండో నాయిక పాత్ర పోషించిన హనీ రోజ్కీ మంచి పేరొచ్చింది. త్వరలోనే 50 రోజుల ఫంక్షన్‌ని గ్రాండ్‌గా చేయాలని మైత్రీ మూవీస్ సంస్థ భావిస్తోంది.