ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేంద్రంపై పోరాడుతున్న వారినే టార్గెట్ చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా విపక్ష నేతలనే టార్గెట్ చేశాయన్నారు. భారీ స్కాంకు పాల్పడిన అదానీ విషంయలో సీబీఐ, ఈడీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే సెబీతో పాటు .. ఓ కమిటీ విచారణకు ఏర్పాటయిందన్నారు. ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు కొంత మంది .. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసినట్లుగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారని ప్రకటిస్తారని.. బీజేపీ నేతలు చెప్పినంతనే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయా అని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారని.. అలా చేస్తారా లేదా అన్నది దర్యాప్తు సంస్థలే చెప్పాలన్నారు. ఒక వేళ బీజేపీ నేతలే అన్నీ చెబితే ఇక దర్యాప్తు ఏజెన్సీలు ఎందుకని కవిత ప్రశ్నిస్తున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతిని ఇప్పటికే భారత జాగృతిగా మార్చారు. భారత జగృతి ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరగనున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత పేరును ఇప్పటికి పలుమార్లు చార్జిషీట్లతో పాటు కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో సీబీఐ ప్రస్తావించింది. సౌత్ లాబీలో ఆమె బినామీ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నరారని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.