తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ కేసులో యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఫామ్ హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసును జూలై 31వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి ఇప్పటి వరకూ సీబీఐ విచారణ ప్రారంభించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ కేసు సీబీఐ చేతికి వెళ్తే సాక్ష్యాలు నాశనమైపోతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకుండా హడావుడిగా కేసును తీసుకుంటే విమర్శలు పెరుగుతాయన్న కారణంగా సీబీఐ ఎదురు చూసింది.
ఫామ్ హౌస్ కేసు సీబీఐ చేతికి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇంత వరకూ సీబీఐ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం కేసు నమోదు చేయలేదు. కేసు ఫైల్స్ కోసం తెలంగాణ సీఎస్ కు ఆరేడు సార్లు లేఖలు రాశారు . అటు వైపు నుంచి సమాధానం రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. కానీ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి కూడా ప్రయత్నించ లేదు. సుప్రీంకోర్టు యథాతథ స్థితి అంటే.. మళ్లీ సుప్రీంకోర్టు చెప్పే వరకూ సీబీఐ విచారణ చేయకూడదన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది. అదే నిజమైతే ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లినట్లే అనుకోవచ్చు.
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో… ముగ్గురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరుస్తూ ముగ్గురు వ్యక్తులు దొరికిపోయారు. వారు బీజేపీతరపున రాయబారులని ఆరోపిస్తూ కేసు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం కేసును సిట్ కు ఇచ్చింది. ఇందులో బీజేపీ పెద్ద నేతలున్నారని ఆరోపిస్తూ… సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫాం హౌస్ కేసులో ఇవిగో సాక్ష్యాలు అంటూ విడుదల చేశారు. మీడియాకు ప్రదర్శించడమే కాదు.. దేశంలోని అందరి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజే దగ్గర నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకూ అందరికీ పంపారు. అయితే ఇలా ఎలా పంపుతారని.. అసలు సాక్ష్యాలు ఎలా బయటకు వచ్చాయని చెబుతూ.. కేసును.. సీబీఐకి ఇచ్చింది హైకోర్టు .
ఇప్పటికైతే ఇక సీబీఐ విచారణ ప్రారంభించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. యథాతథ స్థితి అంటే… సీబీఐ విచారణకు అంగీకరించినట్లేనని న్యాయనిపుణులు విశ్లేషిస్తే.. సీబీఐ రంగంలోకి దిగే అవకాశం ఉంది.