తెలుగునాట భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది ఛత్రపతి. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా… మాస్, మసాలా, యాక్షన్లకే కేరాఫ్. ఇప్పుడు ఈ సినిమాని, ఇన్నేళ్ల తరవాత హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ – వినాయక్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? థియేటర్లలోకి వస్తుందా? లేదా ఓటీటీ కోసం తీశారా? అనే సవాలక్ష అనుమానాలు నెలకొన్నాయి. మొత్తానికి ఈ రీమేక్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యిందని టాక్. మే 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టైటిల్ కూడా `ఛత్రపతి`నే.
నిజానికి ఈ టైటిల్ వల్లే ఈ రీమేక్ ఆలస్యమైంది. ఈ సినిమాకి `ఛత్రపతి` టైటిల్ తప్ప మరో టైటిల్ పెట్టడానికి దర్శక నిర్మాతలకు మనసొప్పలేదు. అయితే ఆ టైటిల్ మాత్రం బాలీవుడ్ లో మరో నిర్మాత రిజిస్టర్ చేయించుకొన్నాడు. ఆ నిర్మాతతో సంప్రదిస్తే టైటిల్ రూపేణా గుడ్ విల్ దాదాపు రూ.2 కోట్లు అడిగినట్టు టాక్. టైటిల్ కోసం అంత ఎందుకివ్వాలి? అంటూ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. భారీ రికమెండేషన్లు చేయించినా, సదరు నిర్మాత టైటిల్ విషయంలో వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ నిర్మాత అడిగిన రెండు కోట్లూ ఇచ్చి టైటిల్ కొనుక్కొన్నట్టు టాక్. ఛత్రపతి సినిమా హిందీలో `హుకూమత్కీ జంగ్` పేరుతో యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది. దాన్ని ఇప్పటికే లక్షలమంది చూసేశారు. ఇప్పుడు బెల్లంకొండ చేస్తే… దాన్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు వస్తారా? అనేదే పెద్ద డౌటు.