రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దాన్ని ఆ పార్టీ సీనియర్లు తమకే ఆపాదించుకుని అదే పనిగా ఆయనను టార్గెట్ చేయడానికే సమయం కేటాయిస్తున్నారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో సీనియర్ కేసీఆర్తో కుమ్మక్కయి పార్టీ మారారాని అందుకే.. కొత్త తరం పార్టీలో పెరిగిందన్నారు. తనకు టీ పీసీసీ చీఫ్ అందుకే వచ్చిందన్నారు. అయితే ఇది పార్టీ మారిన వారిని కాకుండా సీనియర్లను అన్నారంటూ కొంత మంది నేతలు విమర్శలు ప్రారంభించారు. హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కొంత మంది నేతలపై కోవర్టులనే ముద్ర ఉంది. తమను కోవర్టులంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ సారి ఫైర్ అయ్యారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోవర్టులంటూ పోస్టర్లు కూడా ముద్రించారు. ఈ పరిమామాల మధ్య.. రేవంత్ రెడ్డి మళ్లీ సీనియర్లు… కేసీఆర్ తో కుమ్మక్కు వంటి పదాలు వినియోగించడంతో వారంతా మళ్లీ యాక్టివ్ అయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తాను అనని వాటిని అన్నట్లుగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయవద్దని ఆయన కొన్ని మీడియా సంస్థలకు సూచించారు.
రేవంత్ రెడ్డి పరిస్థితి టీ పీసీసీలో కత్తి మీద సాములా మారింది. ఏ చిన్న మాట తేడాగా ఉన్నా అవి తమను అవమానించేవే అంటూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మహేశ్వర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రను నిలిపివేశారు. థాక్రేనే ఆపేయమన్నారని అలా ఎందుకు చెప్పారని మహేశ్వర్ రెడ్డి ఓ లేఖ రాశారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఏదైనా అంతర్గతంగా చూసుకోవాల్సిన అంశం ఇలా కావాలని రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.