పార్టీ ప్రారంభించిన పదో ఏట పవన్ కల్యాణ్ చాలా స్పష్టతగా ప్రజల ముందుకు వచ్చారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావసభలో పవన్ కల్యాణ్… గతంలోలా ఆవేశపడటానికి.. తనపై ఇతరులు చేసిన కామెంట్లపై విరుచుకుపడటానికన్నా తన విజన్ ను చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. రాజకీయంగా కూడా అసలు నిజమేంటి.. భ్రమ ఏంటి అనేదాన్ని పక్కాగా క్యాచ్ చేశారు. అందుకే ఈ సారి జనసేన బలి పశువు కాబోదని ఆయన స్పష్టత ఇచ్చారు.
పోటీ చేసే అన్ని చోట్లా గెలిచేలా ప్రణాళిక
జనసేన పార్టీ కి ఉన్న బలం ఏమిటో పవన్ కల్యాణ్ అంచనా వేసుకున్నారు. దానికి తగ్గట్లుగానే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. పోటీచేసే అన్ని చోట్లా గెలిచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ సారి జనసేన ముద్ర ఉంటుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఏకాఏకిన సీఎం కావాలన్న లక్ష్యం పవన్ లో కనిపించలేదు. ముందు పార్టీని.. ఎమ్మెల్యేలను సభలో కీలక పొజిషన్లో ఉంంచాలని అనుకుంటున్నారు. దానిప్రకారమే మాట్లాడారు.
టీడీపీతో పొత్తుపై మరిన్ని సంకేతాలు !
తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ మరిన్ని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ సహకరించకపోవడం వల్లనే టీడీపీ అవసరం లేనంతగా ఎదగలేకపోయామని చెప్పారు. అంటే ఇప్పుడు టీడీపీతో జట్టు కట్టక పరస్థితి వచ్చిందని ఆయన ఒప్పుకున్నట్లయింది. అదే సమయంలో వైసీపీ నేతలు ఏది వద్దనుకుంటున్నారో అదే జరిగి తీరుతుందని ప్రకటించారు. వైసీపీ నేతలు ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేసి రెచ్చగొడుతున్నారు. టీడీపీ, వైసీపీ కలిస్తే తమ ఓటమి ఘోరంగా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇలా చేస్తున్నారని… వారి అనుకునేది జరగదని స్పష్టం చేశారు.
కలసి వస్తే బీజేపీ.. లేకపోతే లేదు !
బీజేపీతో పొత్తు విషయంపై పవన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై దాడుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయినా బీజేపీతో ఉంటే ముస్లిం వర్గాలు దూరమవుతాయనుుకంటే.. తాను ఆ పార్టీకి దూరం జరుగుతానని ప్రకటించారు. అదే సమయంలో తాము ఎదగలేకపోవడానికి బీజేపీ రాష్ట్ర నేతలేనని చెప్పారు. మొత్తంగా బీజేపీ కూడా కలసి వస్తే సరే లేకపోతే… టీడీపీతో వెళ్తానని ఆయన సంకేతాలు ఇచ్చినట్లయింది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బహిరంగసభ గత పదేళ్లలో ఎన్నడూ లేనంత క్లారిటీగా సాగిందని అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ ర్యాలీ వల్ల ఆలస్యం అయింది కానీ… మిగతా జనం హాజరు.. స్పందన జనసైనికులు అందర్నీ సంతృప్తి పరిచేలా సాగాయి.