వైఎస్ఆర్సీపీ లో చేరిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు నేరుగా కండువాలు కప్పుకోలేదు. కొడుకులకో.. కీలక అనుచరులకో కండువాలు కప్పించి… తాము చేరిపోయినట్లే అని కలరింగ్ ఇచ్చారు. తాము మాత్రం అధికారికంగా పార్టీలో చేరలేదు. కానీ వారి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక కట్టం కింద అనర్హులు కాకుండా ఉండటం కోసం.
ఇప్పుడు అదే ప్లాన్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమలు చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 24వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి వరకూ ఆయన వైఎస్ఆర్సీపీ సేవాదళ్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మూడు రోజుల కిందట ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశరు. అయితే శ్రీధర్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన నేరుగా టీడీపీలో చేరే అవకాశం ఉండేది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పార్టీ మారితే అనర్హతా వేటు వేస్తారు. సస్పెండ్ చేస్తే ఆ సమస్య ఉండదు. గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన టీడీపీలో చేరడానికి ఏ సమస్యా ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా గిరిధర్ రెడ్డిని టీడీపీలో చేరుస్తున్నట్లుగా భావిస్తున్నారు. వైసీపీకి దూరం జరిగినప్పుడే 2024 ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు.