తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరింతగా చిక్కుల్లోకి వెళ్లిపోయారు. దీనికి కారణం ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ వ్యూహకర్తలు అర్థంపర్థం లేకుండా తీసుకున్న నిర్ణయాలేనని చెబుతున్నారు. ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వెళ్లి కూడా చివరి క్షణంలో ఆమె నిర్ణయం మార్చేసుకున్నారు. అరెస్ట్ భయమో మరో కారణమో కానీ.. హైదరాబాద్ నుంచి అందిన సందేశం మేరకు ఈడీ విచారణకు డుమ్మా కొట్టేసి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. కవితకు భరోసా ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు కూడా హైదరాబాద్ వచ్చేశారు. దీంతో ఈడీ ఈ కేసులో మరింత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కవిత గైర్హాజర్ కారణం చూపి పిళ్లైను మరో మూడు రోజుల కస్టడీకి కోర్టు నుంచి ఈడీ అనుమతి తీసుకుంది. అదే సమయంలో ఈడీ కవితకు 20వ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అది ఈడీ వేసిన అసలైన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఎందుకంటే… సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ 24న విచారణకు వస్తుంది. ఆ తర్వాతే వస్తానని కవిత లేఖ రాశారు. కానీ 20నే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. రెండో సారి కూడా ఈడీ నోటీసులకు స్పందించకపోతే వెంటనే ఈడీ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కవిత హాజరైతే.. గత లేఖకు విలువ లేనట్లవుతుంది. అదే సమయంలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు కవిత మరోసారి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
ఎలా చూసినా కవిత గురువారం విచారణకుహాజరు కాకపోవడం వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది. విచారణకు హాజరయినప్పుడు అరెస్ట్ చేయడం వేరని.. విచారణకు సహకరించకపోవడం కారణంతో అరెస్ట్ చేయడం వేరని గుర్తు చేస్తున్నారు. ఈడీకి ఉన్న అధికారాలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ.. రాజకీయ పరమైన ఆరోపణలు చేసి విచారమకు డుమ్మా కొట్టడం న్యాయస్థానాల్లో వాదనలకు నిలబడదు. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా నే అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఈడీపై ఇన్ని ఆరోపణలు చేయలేదు.కేంద్రంపై చేశారు. కానీ కవిత మాత్రం నేరుగా ఈడీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది కవితను మరింతగాచిక్కుల్లోకి నెడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.