ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోని… ఏ పార్టీలో ఉన్నా వివాదాల జోలికి వెళ్లని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎంపీ చేద్దామనకున్న మాగుంట.. ఇప్పుడు తానుకూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఆయనకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. పద్దెనిమిదో తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చి.. లిక్కర్ జోన్లను పంచుకున్న బినామీ వ్యాపారుల్లో మాగుంట ఒకరని ఈడీ చెబుతోంది.
శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంటల పేర్లును ప్రస్తావిస్తోంది. ఇప్పటికే అందర్నీ అరెస్ట్ చేసినందున మాగుంట శ్రీనివాసరెడ్డికి అరెస్ట్ ముప్పు ఉందన్న ప్రచారం జరుగుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి మద్యం వ్యాపారమే . ప్రముఖ బ్రాండ్లు తయారు చేసే డిస్టిలరీలు ఉన్నాయి. అయితే ఆయన ఎప్పుడూ రీటైల్ వ్యాపారం చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ వచ్చిన తర్వాత ఆయన కంపెనీ తయారు చేసే బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశారు. అదే సమయంలో కొత్త ఎక్సైజ్ పాలసీతెచ్చే వరకూ సరఫరా చేసిన సరుకకు డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.
అదే సమయంలో ఆయనకు కొంత మంది ఢిల్లీ లిక్కర్ పాలసీ ని చూపించి కలిసి బిజినెస్ చేద్దామని నూరిపోయడం.. వారంతా తిరస్కరించలేని ప్రముఖులే కావడంతో మాగుంట కూడా చేయి కలిపినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడుఅంతా బయటపడటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. కుమారుడు జైలుకెళ్లారు. ఆయనకూ అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. ఈ పరిణామాలు మాగుంట అభిమానుల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. ప్రజల్ని దోచుకుంటున్న వాళ్ల కళ్లముందు దర్జాగా ఉంటే.. అవినీతి మరక లేని మాగుంట వంటి వారు జైలుకెళ్లాల్సి వస్తోందని మథనపడుతున్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో.. ?