” అద్బుతం జరిగే దాకా ఎవరికీ తెలియదు.. జరిగిన తర్వాత ఎవరికీ అక్కర్లేదు ” .. ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోయి.. ఎవరికీ పట్టని అద్భుతాలు ఈ కోవలోకి వస్తాయి. కానీ అనుక్షణం శ్రమించి సృష్టించే అద్భుతం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రాజమౌళి సాధించి తెచ్చిన ఆస్కార్ లాగా. ఆస్కార్ అవార్డు వచ్చింది రచయిత చంద్రబోస్‌కు.. స్వరపరిచిన కీరవాణికి. మరి జక్కన్నకు ఎందుకు క్రెడిట్ అంటే…మొత్తం ఆయనే చేశారని అందరికీ తెలుసు. ట్రిపుల్ ఆర్ సినిమాకు కర్త, కర్మ, క్రియ రాజమౌళినే. ఆ ఒక్క సినిమాకే కాదు తాను దర్శకత్వం చేసిన ప్రతీ సినిమాకు ఆయనది అదే పాత్ర. ఆ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అంత ఎందుకు కీరవాణి ఇప్పటి వరకూ ఎంతో మంది దర్శకుల వద్ద పని చేశారు. కానీ ఎందుకు రాజమౌళి సినిమల్లో ఇచ్చేంత ఔట్ పుట్ ఇవ్వడం లేదు. అంటే… తేడా రాజమౌళినే. తనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. రాజమౌళికి ఏం కావాలని చెబుతున్నారో కీరవాణి అర్థం చేసుకుంటారు. అందుకే ఫైనల్‌గా జన రంజకమైన సినిమాపాటలు వస్తాయి. అందుకే ఆస్కార్ స్టేజ్ మీద అవార్డు అందుకున్నది రాజమౌళి కాకపోయినా.. అసలు ఆస్కార్ రత్నం మత్రం జక్కన్నే.
ఆస్కార్ ఇక అందని ద్రాక్ష కాదు !
ఆస్కార్ అవార్డులు 125 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఇవేమీ ప్రపంచ స్థాయి అవార్డులు కాదు. నోబెల్ బహుమతుల్లాంటివి కావు. ప్రధానంగా హాలీవుడ్ సినిమాల కోసమే ఇస్తారు. కానీ.. హాలీవుడ్ సినిమా అని ముద్ర వేయించుకుని పోటీలో ఉండటానికి ప్రపంచం మొత్తం సినిమాలకు అవకాశం ఉంది. అయినా ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు తీసే భారతీయ సినిమా పరిశ్రమల నుంచి ఆస్కార్ దాకా వెళ్లినవి తక్కువే. నామినేషన్ సాధించడమే గొప్ప అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక అవార్డులు గెలుచుకున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువ. 1957లో తొలిసారి మన దేశం నుంచి హిందీ సినిమా ‘మదర్ ఇండియా’ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయింది. కానీ పురస్కారం దక్కలేదు. 1982లో ‘గాంధీ’ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా భాను అతైయా మొదటిసారి ఆస్కార్ సాధించారు. ఆర్ట్ ఫిలింలు, జన జీవన ఇతివృత్తాలతో సినిమాలు తీసిన సుప్రసిద్ధ బెంగాలీ చిత్ర దర్శకనిర్మాత సత్యజిత్‌రేకు 1992లో ఆస్కార్ గౌరవ పురస్కారం ఇచ్చారు. 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే బ్రిటీష్ సినిమాకు సాంకేతిక విభాగాల్లో పని చేసిన భారతీయులు నలుగురికి ఆస్కార్ దక్కింది. ఆ సినిమాకే సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్‌కు సౌండ్ మిక్సింగ్, మ్యూజిక్ రెండు అవార్డులొచ్చాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో గునీత్ మోంగాకు 2019లో ఆస్కార్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు, బెస్ట్ షార్ట్ ఫిలిం ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ లభించింది.
ఇతర ఆస్కార్లకన్నా ట్రిపుల్ ఆస్కార్ ప్రత్యేకం !
ఇప్పటి వరకూ అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమాలకు ఇచ్చే అవార్డులు ఓ కోణంలో ఉంటాయి. దేశ దరిద్రాన్ని ప్రపంచం ముందు ఉంచితే వాటిని మెచ్చి అవార్డులు ఇచ్చేవారు. ప్రపంచంలో ఇండియాకు ఓ రకమైన నిరుపేద దేశం ఇమేజ్ పెంచే సినిమాలకు అవార్డులిస్తారు. దేశంలో పేదరికం లేదని చెప్పలేం… కానీ ఇప్పుడు దేశం ఎంతో మెరుగుపడింది. కానీ ఆ పేదరికాన్ని హైలెట్ చేసి ప్రపంచం ముందు ఉంచిన కథకే అవార్డులు దక్కాయి. ఎందుకిలా జరిగింది ? ఇదొక్కటే కాదు… అంతర్జాతీయంగా ఏదైనా సినిమా భారత్ గురించి తీయాలంటే.. ఎక్కడా ఓ క్లాస్ కథను తీసుకోరు. మొత్తంగా దేశంలో పాములు ఉంటాయి.. కప్పలు ఉంటాయి… సర్కస్ జనాలు అన్నట్లుగా చూపిస్తారు. ఇలా సినిమాల్లో ఇండియన్ అంటే.. ఓ రకమైన బ్యాడ్ ఇమేజ్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు వీటన్నింటినీ పటా పంచలు చేస్తూ.. తొలిసారి ఆర్ఆర్ఆర్.. ఓ అద్భుతమైన ఎంటర్ టెయినర్ గా ఇండియా నుంచి ప్రపంచం ముందు నిలబడింది. ఇదీ జక్కన్న చేసిన మ్యాజిక్. ఓ కమర్షియల్ సినిమాను ప్రపంచం ముందు కాలర్ ఎగరేసేలా నిలబెట్టిన ఘనత రాజమౌళికి సొంతం అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి ఆస్కార్ రావడం సామాన్యమైన విషయం కాదు. అవార్డులను ఎంపిక చేసే వారి మైండ్‌లో ఆ సింగర్ల స్థానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వారికి అసలు కీరవాణి అనే పేరు కూడా తెలిసి ఉండదు. కానీ తాను ఎవరిని అనే విషయాన్ని పాటల ద్వారానే .. సంగీతం ద్వారానే వారికి తెలియచేశారు. ప్రపంచ యువనికపై భారత్ సంగీతానికి ఓ ప్రత్యేకతను తెచ్చి పెట్టారు. మనం కూడా… హాలీవుడ్ స్థాయి కమర్షియల్ సినిమాలకు వెళ్తున్నామని మేకర్లు నిరూపిస్తున్నారు. రాజమౌళి చేసి చూపించారు.
మార్కెటింగ్‌లోనూ మాస్టర్ రాజమౌళి !
అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేయడమే కాదు మార్కెట్ చేసుకోవడం కూడా ముఖ్యం. గొప్ప ఉత్పత్తి చేశామని ఎవరూ పట్టించుకోవడం లేదని… ప్రజలకు తమ అవసరాలు తెలియవని.. మంచిదేదో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఏడిస్తే అంతకు మించి చేతకానితనం ఏమీ ఉండదు. ఎంత గొప్ప ప్రొడక్ట్ ఇచ్చావో ప్రజలకు కూడా తెలిసేలా చేయగలగాలి. అదే మార్కెటింగ్. ఈ విషయంలో మంచి ప్రొడక్ట్ ఇవ్వడంలోనే కాదు..దాన్ని మార్కెట్ చేసుకోవడంలోనూ రాజమౌళి సిద్ధహస్తుడు. ట్రెండ్ సెట్టర్ . ఎక్స్ పర్ట్. ఆ విషయం ఆయన గత సినిమాల ద్వారాలనే స్పష్టమయింది. ఆర్ఆర్ఆర్ విషయంలో ఆయన విశ్వరూపం చూపించేశారని అనుకోవచ్చు. అద్భుతాలు ఆకాశంలో నుంచి ఊడి పడవు. మనమే చేయాలి. అదృష్టం కొద్దీ రావు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టానికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే.. ప్రపంచాన్ని జయించవచ్చు. ఇక్కడ ప్రపంచాన్ని జయించడం అంటే… పీఠం వేసుకుని కూర్చోవడం కాదు.. ఎంచుకున్న రంగంలో ప్రపంచ స్థాయికి ఎదగడం. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం చూపించింది. ఆస్కార్ అవార్డును నాటు.. నాటు పాట సాధించింది. ఇది అనితర సాధ్యమైన విజయం. ఓ తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్లడం ఆషామాషీ కాదు. అసలు బాలీవుడ్ సినిమా కూడా ఆ స్థాయికి వెళ్లడం అసాధ్యం. కానీ తమ సినిమాను గొప్పగా తీరిదిద్దడం.. ప్రజల ముందు ఉంచడం.. మాత్రమే కాదు.. అంతే అద్భుతంగా ప్రపంచ వేదిక ముందు ప్రమోట్ చేసుకున్నారు. ఇంత పర్ ఫెక్ట్ ప్లానింగ్ అందరికీ రాదు. ఎంతో సమయం కేటాయించాలి. అంతకు మించిన వ్యూహాత్మక అడుగులు పడాలి. ప్రపంచ వేదిక ముందు ఏ మాత్రం అనుభవం లేకపోయినా.. అద్భుతంగా ప్రమోట్ చేసుకున్నారు. తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకున్నారు.
ఇక ఇండియన్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ సినిమాలే !
తెలుగుసినిమా ఆస్కార్ స్థాయికి వెళ్ళింది ఇదే మొదటి సారి.ఆస్కార్ దేశానికి సాధించిన మొదటి ఫీచర్ చిత్రం. నాటు, నాటు పాట రాసిన చంద్రబోస్,గాయకులు రాహు ల్ సిప్లిగంజ్ కాలభైరవలు చలనచిత్ర చరిత్రలో గుర్తుండి పోతారు. దీనికి కారణమైన రాజమౌళి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆయన స్ఫూర్తిగా మిగిలిపోతారు. హుబలి చిత్రంతో యావత్ ప్రపంచం భారతీయ సినిమా వైపు ఎదురు చూస్తోంది.ఆ చిత్రాన్నీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్నీ నిర్మించింది రాజమౌళి యే కావడం గమనార్హం. రాజమౌళి కృషి, పట్టుదల అద్వితీయం, ఆస్కార్ సాధించాలన్న ఆయన ఆశయం నెరవేరింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఫీట్‌తో ఇండియన్ సినిమాలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇంగ్లిష్ ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లభిస్తున్న ప్రోత్సాహమే వారికి ఉత్సాహం ఇస్తుంది. ఇది మరిన్ని అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావడానికి కారణం అవుతుంది. అంటే భారతీయ సినిమా రేంజ్ పెరుగుతుంది. అదే జరిగితే.. భారత్ ప్రపంచ పటంలో ప్రముఖంగా మారితోందని చెప్పుకోవడం అతిశయోక్తి ఎందుకవుతుంది. ఆస్కార్ దారిలో ఆర్ఆర్ఆర్ ఎన్నో అసామాన్యమైన అడుగులు వేసింది. ఆస్కార్ అకాడమీ సభ్యుల్ని ఆకట్టుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీం.. సినిమాను ది బెస్ట్ అన్న రీతిలో ప్రమోట్ చేసుకున్నారు. అనుకున్న ఫలితం సాధించారు. ఈ విజయం వారికి మాత్రమే మేలు చేయదు. దేశ సినిమా రంగానికి మేలుచేస్తుంది. భారత సినీరంగం ప్రపంచ స్థాయికి వెళ్లడానికి ఓ వారధిలా ఉపయోగపడుతోంది.
ఏడ్చేవాళ్లూ ఉంటారు !
అయితే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినప్పటి నుండి ఓ ఘన త సాధంచారని.. అద్భుతంగా ప్రయత్నించారని.. తమ ప్రొడక్ట్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అభినందించేవారితో పాటు అసలు ఆ సినిమాలో ఏముందని.. అనేవాళ్లు కూడా ఉన్నారు. అది చరిత్ర వక్రీకరణ అంటారు. చివరికి పాటలోని సాహిత్యాన్నీ కూడా తప్పు అనే వారున్నారు. సోషల్ మీడియాలో ఇలా తమ పైత్యం చూపించుకుంటూనే ఉన్నారు. అందరూ పొగుడుతున్నదాన్ని తాము విమర్శిస్తే.. తమకు అటెన్షన్ వస్తుందని వీరి నమ్మకం కావొచ్చమో కానీ.. ఇలాంటి వారి జాబితాలో కొంత మంది ప్రముఖులు కూడా ఉండటం విచిత్రం. తమ జీవితంలో ప్రజలను మెప్పించే సినిమా ఒక్కటీ తీయలేని అసమర్థుని జీవయాత్ర హీరోలు చాలా మంది ఆర్ఆర్అర్పై పడి ఏడుస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి విషయాల్లో వీరికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విజయం విలువ తెలుస్తుంది. ఓ సినిమా అంతర్జాతీయ స్థాయిదా కాదా అని చెప్పాల్సింది వీళ్లు కాదు.. ప్రేక్షకులు. ప్రపంచం మొత్తం రిలీజైన సినిమా.. విడుదలైన అన్ని చోట్లా అద్భుత విజయం సాధించిన సినిమా ప్రపంచ స్థాయి సినిమా కాదని.. ఎలా అంటారు. కేరళ సినిమాలతో… హాలీవుడ్ సినిమాలతో పోల్చుకుని.. ఆ స్థాయిలో లేదని చెప్పుకోవడం .. మనల్ని మనం కించపర్చుకోవడమే. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఇలాంటి వారంతా మనం అంటూ ఓ ఘతన సాధిస్తే ఏడుస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి వారి ఏడుపులే విజయ తీరానికి చేరుతున్న వారికి శ్రీరామరక్ష.
ఓ మంచి కమర్షియల్ సినిమా ఇప్పుడు భారత్ నుంచి వచ్చింది. ఆ సినిమా ఇక ముందు భారత్ నుంచి వస్తున్న సినిమాలకు ఓ బ్రాండ్ ఏర్పాటు చేసింది. ఆ బ్రాండ్ వల్ల భారతీయ సినిమా పరిశ్రమ లాభపడనుంది. ఇక నుంచి అమెరికాలో రిలీజయ్యే ఇండియన్ సినిమాలు కేవలం భారత సంతతి వారు మాత్రమే కాదు ఇంగ్లిష్ జనం కూడా చూడొచ్చు. మన కంటెంట్ వారికి కొత్తగా ఉండొచ్చు. అద్భుత విజయాలు సాధంచవచ్చు. దీనికి దారి చూపించింది మాత్రం రాజమౌళినే. అందుకే టేక్ ఏ బౌ రాజమౌళి.