కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇరవయ్యో తేదీనే రావాలని నోటీసులు పంపింది. అయితే ఇంతకు ముందు ఈడీకి రాసిన లేఖలో కవిత చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో విచారణ తర్వాతనే వస్తానని చెప్పారు. ఇప్పుడు రెండో సారి నోటీస్ జారీ చేసినా హాజరు కాకపోతే వెంటనే వారెంట్ జారీ అవుతుందన్న ఆందోళన కవిత వర్గీయుల్లో కనిపిస్తోంది.
అందుకే వెంటనే తాను దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ చేపట్టాలని సీజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే వర్కవుట్ కాలేదు. దీంతో విచారణ 24వ తేదీనే జరగనుంది. సుప్రీంకోర్టు విచారణలో ఊరట లభిస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ విచారణకు వెళ్లడానికి కవిత ఇష్టపడటం లేదు. వీడియో కాన్ఫరెన్స్ అయినా లేకపోతే తన ఇంట్లో అయినా విచారణ చేసుకోవచ్చని అంటున్నారు.
కానీ తొలిసారిగా ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. కానీ రెండో సారి మాత్రం హాజరు కాలేదు. ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అరెస్ట్ చేస్తారన్న కారణంగానే కవిత విచారణకు వెళ్లడం లేదని.. న్యాయస్థానాలను ఆశ్రయించి ఊరట పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఎప్పుడు వెళ్లినా వెళ్లకపోయినా చిక్కులే. అందుకే కవిత ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది.