పులివెందులలో వైసీపీకి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లుగా పట్టభద్రుల ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మొత్తం పులివెందుల పట్టణంలో పట్టభద్రులు టీడీపీకి మద్దతుగా నిలిచారు. పోలైన ఓట్లలో 4323 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రాగా… వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి వచ్చింది 2120 ఓట్లు మాత్రమే. ఇతరులకు 123 ఓట్లు వచ్చాయి. సాధారణంగా పులివెందుల పట్టణం అంటే.. వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటుంది. కానీ ఈ సారి మాత్రం పట్టభద్రులు సీన్ మార్చేశారు. ఏకంగా రెండు వేలకుపైగా మెజార్టీ టీడీపీకి ఇప్పించారు.
టీడీపీ తరపున నిలబడిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి చెందిన వారే. వెన్నుపూస రవీంద్రారెడ్డి కర్నూలుకు చెందిన వారు. ఈ కారణంగా వైసీపీ మద్దతుదారులు కూడా ఆయనకు వేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అదే సమయంలో వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలతో జగన్, అవినాష్ రెడ్డిల తీరుపైనా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేలేశారని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున వివేకా కుమార్తె సునీత పోటీ చేస్తుందని.. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల కిందటే.. అదేదో కుట్ర పూరితమైన రాజకీయం అన్నట్లుగా ప్రకటన చేశారు. నిజానికి చర్చలేమీ జరగడం లేదు. కానీ సజ్జల హింట్ ఇచ్చారు. ఒక వేళ అలా జరిగి వివేకా కుమార్తె పులివెందుల నుంచి నిలబడితే మాత్రం.. ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని ఇప్పటికే ఆ నియోజకవర్గంలో చర్చ ప్రారంభమయింది. ఇది జగన్ కు ఇబ్బందికర పరిణామమే.