తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదని.. బీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే తాము చాలా చేస్తున్నామని బీజేపీ ఎదురుదాడి చేస్తూ ఉంటుంది. ఈసారి అలా ఎదురుదాడి చేయడానికి ఓ బలమైన అంశాన్ని సృష్టించుకుంది. అదే టెక్స్ టైల్ పార్క్. తెలంగాణలో కేంద్రం టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ , కర్నాటక , మధ్యప్రదేశ్ , గుజరాత్ లలో మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల ద్వారా టెక్స్టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసింది.ఈ మెగా టెక్స్టైల్ పార్క్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని చాలా సార్లు మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పటి వరకూ నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా మెగా టెక్స్ టైల్ పార్క్ ను మంజూరు చేశారు. ఈ మెగా టెక్సైటైల్ పార్క్ నే మోదీ ప్రకటించిన పార్క్ గా మార్చేసి.. నిధులు తీసుకునే అవకాశం తెలంగాణ సర్కార్కు లభించింది.